చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. వరుస హిట్లను ఇచ్చిన డైరెక్టర్ ఒక్క ప్లాప్ ఇస్తే అతడి కెరీర్ పడిపోయినట్లే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ పరిస్థితి అటుఇటుగా ఇలాగే ఉందని చెప్పాలి. కోలమావు కోకిల, వరుణ్ డాక్టర్ లాంటి హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు విజయ్ కు బీస్ట్ లాంటి ప్లాప్ సినిమాను అంటకట్టాడంటూ విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక ఈ సినిమా ఎఫెక్ట్ నెల్సన్ కెరీర్ పై బాగా పడిందనే చెప్పాలి. బీస్ట్ సెట్స్ మీద ఉన్నప్పుడే నెల్సన్- రజినీకాంత్ సినిమాను లైన్లో పెట్టిన సంగతి తెల్సిందే.
బీస్ట్ విడుదల తరువాత రజినీ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారని ఎప్పటినుంచో వినిపిస్తున్న మాటే.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో రజినీ సినిమా వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది. బీస్ట్ నిర్మించిన సన్ పిక్చర్స్ వెంటనే వీరి కాంబినేషన్ లో సినిమా కూడా ఎనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు అవకాశం నెల్సన్ చేయి జారినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. విజయ్ కే ఇంతటి ప్లాప్ ను ఇస్తే.. వరుస ప్లాప్ లు అందుకుంటున్న రజినీకి హిట్ ని ఏమి ఇస్తాడు అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.