Laal Singh Chaddha Movie Lands in New Trouble: ఆమిర్ ఖాన్ సినిమా వస్తోందంటే.. బాలీవుడ్‌లో వారం, పది రోజుల నుంచే హంగామా మొదలవుతుంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? థియేటర్లపై ఎప్పుడెప్పుడు డండయాత్ర చేద్దామా? అన్నట్టుగా ఒక హడావుడి వాతావరణం నెలకొంటుంది. అది.. అతినకున్న స్టార్డమ్, అతని సినిమాపై నమ్మకం. కానీ.. ఈసారి మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని, బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇందుకు కారణం.. గతంలో వీళ్లు చేసిన సంచలన వ్యాఖ్యలే!
‘పీకే’ సినిమాలో శివుడి వేషంలో ఉన్న ఓ వ్యక్తిని ఆమిర్ ఖాన్ వెంబడించే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది తమ దేవుడ్ని హేళన చేసినట్టుగా ఉందని, దాన్ని తొలగించాలని అప్పట్లోనే వివాదం రేగింది. ఇప్పుడు మళ్ళీ ఆ సీన్‌కి సంబంధించిన ఫోటోలని షేర్ చేస్తూ.. మన దేవుడ్ని కించపరిచే హీరో సినిమాని బాయ్‌కాట్ చేయాలని కోరుతున్నారు. కేవలం ఈ ఒక్క సన్నివేశమే కాదు.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘శివుడిపై పాలు పొంగి వేస్ట్ చేయడం కన్నా, పేద పిల్లలకు ఆ డబ్బుతో కడుపు నింపడం మిన్నా’ అని ఇచ్చిన స్టేట్మెంట్‌ని కూడా ఈ సందర్భంగా బయటకు లాగారు. అలాగే.. ఇందులో కథానాయికగా నటించిన కరీనా కపూర్ సైతం ఓ సందర్భంలో ‘మా సినిమాల్ని చూడకండి, మేమేం చూడమని బలవంతం చేయలేదు’ అని చేసిన వ్యాఖ్యల్ని కూడా సీన్‌లోకి తీసుకొచ్చారు. వాళ్లిద్దరు నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ను చూడకండి అంటూ.. నెట్టింట్లో #BoyCottLaalSinghChaddha అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రేండ్ చేస్తున్నారు.
కాగా.. లాల్ సింగ్ చడ్డాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆమిర్, ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్‌తో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకోవడంతో, ఆ మచ్చని ఈ చిత్రంతో తుడిచేసుకోవాలని ఆమిర్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే, గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. కానీ, ఇంతలోనే అతని సినిమా కొత్త చిక్కుల్లో చిక్కుకుంది. మరి, దీనిపై ఆమిర్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.