కొరటాల శివ నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్ననేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఘన విజయం కొరటాలను అందలం ఎక్కించింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇన్ని సక్సెస్ లు ఉన్న కొరటాలను ఒకే ఒక్క సినిమా దర్శకుడుగాను, ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతీసింది. అదే ‘ఆచార్య’.
చిరంజీవి, రామ్ చరణ్ కలసి నటించిన ఈ సినిమా నిర్మాణం దాదాపు రెండేళ్ళు కొనసాగింది. ఇక ఈ సినిమాకు డైరెక్షన్ చేయటమే కాదు బిజినెస్ పరంగాను డీల్ చేశాడు కొరటాల శివ. అదే ఇప్పుడు ఇతగాడి కొంప ముంచింది. సినిమా రిలీజ్ అయి డిజాస్టర్ కావటంతో అన్ని ఏరియాల నుంచి కొనుగోలు దారులు నష్టపోయిన మొత్తాలను చెల్లించాలని కొరటాలపై వత్తిడి తెచ్చారు. చాలా వరకు ఈ వ్యవహారాలను ఎమికబుల్ గా సెటిల్ చేశారు కొరటాల అతని స్నేహితుడు సుధాకర్. అయితే సీడెడ్ ఏరియాకు సంబంధించిన వ్యవహారం మాత్రం ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ ఏరియాలో పంపిణీ చేసిన అభిషేక్ తో పాటు ఎగ్జిబిటర్స్ తమ డబ్బు చెల్లించాలని కొరటాల ఆఫీస్ కు వెళ్ళి వత్తిడి చేశారు. ఈ విషయంలో కొరటాల సన్నిహితుడు మైత్రీ అధినేత నవీన్ సర్దుబాటు చేయాలని ప్రయత్నించినా సఫలం కాలేదట. కొరటాల నేరుగా వచ్చి హామీ ఇస్తే కానీ సమస్య పరిష్కారం కాదంటున్నారు. ఒక వేళ తమకు న్యాయం జరగకుంటే మెగాస్టార్ చిరంజీవి వద్దకు పంచాయితీ తీసుకువెళతామని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాకు కథ సెట్ చేయటంలో మల్లగుల్లాలు పడుతున్న కొరటాల ఈ కొత్త తలనొప్పితో సతమతం అవుతున్నాడు. మరి ఈ వ్యవహారం ఎప్పుడు ఎలా సెటిల్ అవుతుందో చూడాలి.