ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర రావు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇది సెట్స్ పై ఉండగానే ఎ. ఎం. రత్నం తన కుమారుడి దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించారు. ‘రూల్స్ రంజన్’ అనే ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. శుక్రవారం హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ మూవీ మొదలైంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ హీరో కిరణ్ అబ్బవరంపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శక, నిర్మాత ఎ. ఎం. రత్నం స్క్రిప్ట్ అందించి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శుక్రవారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో శ్రీసాయి సూర్య మూవీస్, స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. ‘వెన్నెల’ కిషోర్, హిమాని, వైశాలి, జయవాణి, ముంతాజ్, సత్య, అనూ కపూర్, సిద్ధార్థ సేన్, అతుల్ పర్చురే, ఆశిష్ విద్యార్థి, అజయ్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించబోతున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’తో దాదాపు రెండు దశాబ్దాల క్రితం దర్శకుడిగా మారిన ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతి కృష్ణ ఆ తర్వాత ‘కేడీ, ఊ ల ల ల’, ‘ఆక్సిజన్’ చిత్రాలను తెరకెక్కించాడు. ఇప్పుడు తన పేరును రత్నం కృష్ణగా మార్చుకున్నాడు. ఈ తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’కు అమ్రేష్ గణేశ్ సంగీతం అందిస్తున్నాడు.