ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టే మనసు తెలుగువారి సొంతం. భాషాభేదాలు లేకుండా టాలెంట్ ను గుర్తించడంలో ముందుంటారు మన తెలుగువారు. అందువల్లే ఎంతోమంది పరభాషా తారలు మన చిత్రసీమలో జేజేలు అందుకుంటున్నారు. ఇతర భాషలకు చెందిన వారి దృష్టి సైతం తెలుగు సినిమావైపే సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ తమిళనటుడు శివకుమార్ తనయులు సూర్య, కార్తీ ఇద్దరూ తెలుగునాట కూడా రాణిస్తున్నారు. సూర్య ముందుగానే వచ్చి, తెలుగువారిని అలరించినా, ఆయన తమ్ముడు కార్తీ మాత్రం తెలుగు నేర్చుకొని మరీ మనవాళ్ళను మురిపించాడు. అందుకే తెలుగునాట కార్తీకి మంచి ఆదరణ లభిస్తోంది. ‘యుగానికొక్కడు’ సినిమాతో తెలుగువారిని పలకరించిన కార్తీ, ఆ చిత్రంతోనే ఆకట్టుకోగలిగాడు. అప్పటి నుంచీ కార్తీ నటించిన చిత్రాలు తెలుగులోనూ అనువాదమవుతూ వచ్చాయి. కార్తీ నటించిన సినిమాలు తమిళనాడులో కంటే తెలుగునాటనే మంచి ఆదరణ పొందిన సందర్భాలూ ఉన్నాయి.
కార్తీ 1977 మే 25న మద్రాసులో జన్మించాడు. ఆయన తండ్రి శివకుమార్ తమిళనాట పేరున్న నటుడు. తెలుగులో మురళీమోహన్, చంద్రమోహన్ నటించిన పలు చిత్రాలు తమిళంలో శివకుమార్ తో రీమేక్ అయ్యాయి. అలాగే ఆయన నటించిన సినిమాలు తెలుగులో మురళీమోహన్, చంద్రమోహన్ హీరోలుగా పునర్నిర్మించారు. ఇక శివకుమార్ నటించిన తమిళ సీరియల్స్ తెలుగులోనూ అనువాదమై అలరించాయి. అలా శివకుమార్ తెలుగువారికి సుపరిచితులే. తండ్రి బాటలోనే పయనిస్తూ శివకుమార్ పెద్ద కొడుకు సూర్య ముందుగా హీరో అయ్యాడు. కార్తీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన తరువాత కొంతకాలం చెన్నైలోనే పనిచేశాడు. ఆ తరువాత అమెరికాలో చదివేందుకు స్కాలర్ షిప్ రాగానే, అక్కడకు వెళ్ళి ‘ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్’లో ఎమ్.ఎస్. చేశాడు. అమెరికాలో ఉన్న సమయంలోనే ఫిలిమ్ మేకింగ్ కోర్సులూ పూర్తి చేయడం విశేషం. ఎంచక్కా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లో సెటిల్ అవుతాడని తండ్రి కలలు కన్నారు. అయితే, కార్తీ మనసు కూడా సినిమాల వైపే పరుగు తీసింది. మణిరత్నం తెరకెక్కించిన ‘ఆయిత ఎళితు’ చిత్రంలో తన అన్న సూర్యకు ఓ సీన్ లో ఫ్రెండ్ గా కనిపించాడు కార్తీ. అదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశాడు. ఈ చిత్రం తెలుగులో ‘యువ’ పేరుతో అనువాదమయింది. అప్పట్లో కార్తీ చాలా లావుగా ఉండేవాడు. తాను సినిమాలకు పనికి వస్తానా, రానా అనే సందిగ్ధంలోనూ ఉన్నాడు. అప్పుడు దర్శకుడు అమీర్ తన ‘పరుతి వీరన్’లో కార్తీని హీరోగా ఎంచుకున్నాడు. ఈ సినిమాద్వారా ప్రియమణికి ఉత్తమనటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ చిత్రంతో కార్తీకి మంచి గుర్తింపు లభించింది. తరువాత ‘ఆయిరత్తిల్ ఒరువాన్’లో నటించాడు. ఈ చిత్రమే తెలుగులో ‘యుగానికొక్కడు’గా వచ్చింది. ఈ సినిమా కార్తీకి మరింత మంచి పేరు సంపాదించి పెట్టింది. అక్కడ నుంచీ వెనుతిరిగి చూసుకోలేదు కార్తీ.
కార్తీ నటించిన అనువాద చిత్రాలు “ఆవారా, శకుని, కాష్మోరా, ఖాకీ, ఖైదీ” తెలుగునాట అలరించాయి. నాగార్జునతో కలసి కార్తీ ‘ఊపిరి’ ద్విభాషా చిత్రంలోనూ నటించి మెప్పించాడు. తెలుగులో కార్తీ ‘ఖైదీ’ మంచి విజయం సాధించింది. ఇదే ఆయనకు చివరి హిట్ అని చెప్పవచ్చు. సూర్య లాగా ఫిట్ నెస్ లేకపోయినా, కార్తీలోని ఈజ్ ను తెలుగువారు భలేగా మెచ్చారు. కొన్ని అనువాద చిత్రాల్లో తనకు తానే డబ్బింగ్ చెప్పుకొని మురిపించాడు కార్తీ. అందువల్ల తెలుగునాట కార్తీ అంటే మరింత అభిమానం పెరిగింది. ఈ మధ్య కార్తీ నటించిన ‘సుల్తాన్’ వచ్చింది కానీ, అంతగా అలరించలేక పోయింది. మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో వల్లవరాయన్ వండియదేవన్ పాత్రలో నటిస్తున్నాడు కార్తీ. ఈ సినిమా తెలుగులోనూ అనువాదం కానుంది. ఇది కాక ‘విరుమాన్’, ‘సర్దార్’ అనే చిత్రాలలోనూ కార్తీ నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో కార్తీ ఏ తీరున ఆకట్టుకుంటాడో చూడాలి.