ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి 2005 నుండి పలు చిత్రాలను నిర్మిస్తూ, నటిస్తున్నాడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. అంతేకాదు… తన తమ్ముడు ఎన్టీఆర్ తోనూ ఆ బ్యానర్ లో ‘జైలవకుశ’ చిత్రాన్ని నిర్మించాడు. త్వరలో తెరకెక్కబోతున్న ఎన్టీయార్ – కొరటాల శివ చిత్రానికి, ఆ తర్వాత వచ్చే ఎన్టీయార్ – తివిక్రమ్ సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడు. ఇదే సమయంలో నటుడిగానూ కళ్యాణ్ రామ్ ఇప్పుడు వేగం పెంచాడు. 2020లో ‘ఎంతమంచి వాడవురా’ మూవీ తర్వాత సొంత బ్యానర్ లోనే తన 18వ చిత్రాన్ని మొదలు పెట్టాడు కళ్యాణ్ రామ్. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు. దీనికి ఆయన బావమరిది హరికృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను తాతయ్య ఎన్టీయార్ జయంతి సందర్భంగా మే 28వ తేదీ మధ్యాహ్నం ప్రకటించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి ‘రావణ’ అనే పేరు పెట్టబోతున్నట్టు ప్రచారం జరిగింది. మరి అదే పేరు ఖరారు చేస్తారా లేక మరేదైనా పవర్ ఫుల్ టైటిల్ పెడతారా అనేది చూడాలి. ఇదిలా ఉంటే… ఈ సినిమాతో పాటే మరో పక్క మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనూ కళ్యాణ్ రామ్ తన 19వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ యేడాది ఫిబ్రవరిలో జరిగాయి. భిన్నమైన కథాంశాలు ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్న కళ్యాణ్ రామ్… వశిష్ఠతో చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఆయన కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ గా ఉండబోతోందని తెలుస్తోంది.