తెరపై ఎక్కువగా కితకితలు పెట్టే పాత్రల్లోనే కనిపించారు కాదంబరి కిరణ్. కానీ, నిజజీవితంలో కన్నీరు పెట్టుకొనే వారిని ఆదుకోవడంలో ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తూ ఉంటారు కిరణ్. తాను ఏర్పాటు చేసిన ‘మనం సైతం’ సంస్థ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారు కాదంబరి. అందుకే నేడు నటునిగా కన్నా మిన్నగా ఓ మానవతామూర్తిగా జేజేలు అందుకుంటున్నారు కిరణ్.
కాదంబరి కిరణ్ కాకినాడలో జన్మించారు. 1973లో మేనమామల దగ్గర చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చారు. చదువులో ఎంతో చురుకైన వారు. హైదరాబాద్ శ్రీరామచంద్ర కాలేజ్ లో బి.కామ్ చదివారు కిరణ్. చిన్నతనం నుంచీ సినిమా ఆయనను ఆకర్షించింది. దాంతో తొలుత నాటకాల్లో నటించారు. సినిమా రంగంలో ప్రవేశించాలన్న ఉద్దేశంతో పలు ప్రయత్నాలు చేశారు. తరువాత ‘సితార’ సినిమా వారపత్రికలో కొంతకాలం విలేకరిగా పనిచేశారు.
ఆ సమయంలోనే కిరణ్ నటనాభిలాషను తెలుసుకున్న కొందరు దర్శకులు అవకాశాలు కల్పించారు. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం ‘శివ’లో ఓ చిన్న పాత్రలో కనిపించిన కాదంబరి కిరణ్ తరువాత జంధ్యాల తెరకెక్కించిన ‘ప్రేమా… జిందాబాద్’లో నటించారు. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘మనీ’లోనూ కాదంబరి కనిపించారు. అలా చేజిక్కిన పాత్రల్లో రాణిస్తూ వచ్చారు. ‘కుర్రాళ్ళ రాజ్యం’తో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యారు కాదంబరి. తరువాత టీవీ రంగంలో అడుగు పెట్టి పలు సీరియల్స్ లో నటించారు, నిర్మించారు, దర్శకత్వమూ వహించారు.
సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రం తప్పకుండా నటించేసేవారు కిరణ్. “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, అల్లరి రాముడు, దేశముదురు, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు” వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలు పోషించారాయన. కాదంబరి కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ‘మట్టి మనిషి’ టీవీ సీరియల్ లో మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించడం విశేషం! సినిమా రంగం రంగుల ప్రపంచమే కానీ, అందులోని చీకటి కోణాలు ఎవరికీ తెలియవు. అలా చీకట్లో మగ్గుతూ బాధ పడేవారికి చేతనైన సాయం అందించేవారు కిరణ్. తరువాత స్నేహితుల సహకారంతో ‘మనం సైతం’ సంస్థను నెలకొల్పి ఎందరికో సాయం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో చిత్రపురి కాలనీలోని సినీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ ను అందుబాటులో ఉంచి పలువురి ప్రాణాలను నిలిపారు. ప్రస్తుతం చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న కాదంబరి కిరణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆనందంగా సాగాలని ఆశిద్దాం.