తెలుగువారినీ మెప్పించిన తమిళ దర్శకుల్లో కె.బాలచందర్ స్థానం ప్రత్యేకమైనది. తన సమకాలిక దర్శకులు సైతం మెచ్చేలా చిత్రాలను తెరకెక్కించి భళా అనిపించిన ఘనుడు బాలచందర్. ఆయన సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో తరువాతి రోజుల్లో తారాపథంలో జైత్రయాత్ర సాగించారు. మధ్య తరగతి జీవితాల్లోని పలు కోణాలు ఆవిష్కరిస్తూ బాలచందర్ పలు చిత్రాలు తెరకెక్కించారు. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆయన చిత్రాలు ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకొనేవి. నవతరం ప్రేక్షకులు సైతం బాలచందర్ చిత్రాలను చూసి ఆనందిస్తున్నారు. ఇక ఎందరో భావిదర్శకులు బాలచందర్ సినిమాలను అధ్యయనం చేసి, తమ జీవితాలకు సరైన బాట వేసుకుంటున్నారు.
కైలాసం బాలచందర్ 1930 జూలై 9న తమిళనాడులోని తిరువారూర్ జిల్లా మన్నిలంలో జన్మించారు. ఆయనకు ఎనిమిదేళ్ళ వయసులో సినిమాలు చూసే అవకాశం కలిగింది. అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎమ్.కె. త్యాగరాజ భాగవతార్ సినిమాలంటే బాలచందర్ కు ఎంతో అభిమానం! చదువుకొనే రోజుల్లోనే నాటకాలు రాసి, వాటికి దర్శకత్వం వహించేవారు. అయితే చదువును ఏ నాడూ అశ్రద్ధ చేయలేదు. బియస్సీ (జువాలజీ)లో డిగ్రీ పాసయిన తరువాత కొంతకాలం ముత్తుపేటలో టీచర్ గా పనిచేశారు. తరువాత మద్రాసు మకాం మార్చారు. అక్కడ ఓ అకౌంటెంట్ జనరల్ వద్ద క్లర్క్ గా పనిచేశారు. ఆ రోజుల్లో వర్ధమాన కళాకారుల సంఘంలో చేరారు. తరువాత సొంతగా ఓ నాటకసంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈయన నాటక సంఘంలోనే సౌందర్ రాజన్, షావుకారు జానకి, నగేశ్, శ్రీకాంత్ వంటి వారు నటించేవారు. అందరూ చిత్రసీమలోనూ లబ్ధప్రతిష్ఠులుగా రాణించారు. బాలచందర్ రాసిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకం విశేషాదరణ చూరగొంది. పలు ప్రదర్శనలు చూసింది. దాంతో బాలచందర్ కు రచయితగా, దర్శకునిగా మంచిపేరు లభించింది. తద్వారా యమ్.జి.ఆర్. హీరోగా నటించిన ‘దైవ తాయ్’ చిత్రానికి మాటలు రాసే అవకాశం లభించింది. ఆపై తన ‘సర్వర్ సుందరం’ నాటకాన్ని సినిమా తీయగా, దానికీ రచన చేశారు బాలచందర్. తాను రాసిన ‘నీర్ కుమిళి’ నాటకం ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు.
నాటకరంగంలో బాలచందర్ కు ఎంతో పేరు సంపాదించి పెట్టిన ‘మేజర్ చంద్రకాంత్’ను తరువాత సినిమాగా ఆయనే తెరకెక్కించారు. ఆ సినిమా సైతం ఆకట్టుకుంది. ఆయన రూపొందించిన ‘భామా విజయం’ మంచి ఆదరణ పొందింది. అదే సినిమాను తెలుగులో ‘భలే కోడలు’గా రూపొందిస్తూ తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టారు బాలచందర్. తెలుగునాట కూడా బాలచందర్ కు మంచి పేరు లభించింది. చలం హీరోగా బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘సత్తెకాలపు సత్తెయ్య’ చిత్రం మంచి విజయం చూసింది. తరువాత వరుసగా చలంతో “బొమ్మా బొరుసా, జీవితరంగం” వంటి చిత్రాలు రూపొందించారు.
తమిళంలో తాను రూపొందించిన ‘అవల్ ఒరు తోడర్ కథై’ ఆధారంగా తెలుగులో ఆయన దర్శకత్వంలోనే రూపొందిన ‘అంతులేని కథ’ ఇక్కడ కూడా విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్, రజనీకాంత్ తెలుగు తెరకు పరిచయం కాగా, ఇందులో నటించిన జయప్రదకు నటిగా ఎంతో పేరు లభించింది. తనను ఎంతగానో ఆదరించిన తెలుగు సినిమా రంగం అంటే బాలచందర్ కు ఎంతో గౌరవం. ఆయనకు తెలుగు చదవడం రాకపోయినా, తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానం. అందువల్ల తెలుగులోనే ఓ స్ట్రెయిట్ మూవీ రూపొందించాలని ‘మరో చరిత్ర’ను తెరకెక్కించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో కమల్ హాసన్, సరితకు ఎంతో పేరు లభించింది. ఇదే చిత్రాన్ని హిందీలో ‘ఏక్ దూజే కే లియే’గా రూపొందించారు బాలచందర్. ఆ సినిమాతోనే కమల్ హాసన్ హిందీ సినిమా రంగంలో అడుగు పెట్టారు. అదే చిత్రంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా రెండో నేషనల్ అవార్డు లభించింది. ఈ హిందీ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ నిర్మించడం విశేషం!
కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన “అందమైన అనుభవం, గుప్పెడు మనసు, ఇదికథ కాదు, ఆకలి రాజ్యం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, 47 రోజులు, కోకిలమ్మ, రుద్రవీణ” వంటి తెలుగు చిత్రాలు సైతం జనాన్ని ఆకట్టుకున్నాయి. ‘ఇదికథకాదు’లో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి, నటునిగా మంచి మార్కులు సంపాదించారు. తరువాత చిరంజీవి ప్రధాన పాత్రలో ’47 రోజులు’ రూపొందింది. తనలోని నటునికి మెరుగులు దిద్దిన బాలచందర్ దర్శకత్వంలోనే చిరంజీవి తమ తొలి సొంత చిత్రం ‘రుద్రవీణ’ను నిర్మించడం విశేషం! బాలచందర్ సినిమాలతోనే కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి ,జయప్రద, జయసుధ, శ్రీదేవి వంటివారు నటులుగా మంచి పేరు సంపాదించారు. చిత్రసీమలో తమదైన బాణీ పలికించగలిగారు. ఇలా ఎందరికో సినిమాల్లో రాణించే అవకాశం కల్పించిన బాలచందర్, తమ కవితాలయా ప్రొడక్షన్స్ పతాకంపై తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ చిత్రాలు నిర్మించారు. ఆ పై ఇతర దర్శకులతోనూ తన బ్యానర్ లో సినిమాలు నిర్మించి, అలరించారు. చిత్రసీమలో ప్రతిష్ఠాత్మక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కేను అందుకున్నారు. 2014 డిసెంబర్ 23న బాలచందర్ కన్నుమూశారు. మధ్యతరగతి జీవితాల నేపథ్యంలో బాలచందర్ తెరకెక్కించిన చిత్రాలు ఈ నాటికీ జనాన్ని ఆకట్టుకుంటూనే ఉన్నాయి.