Jr Ntr Invited To Minister Ponguleti Sreenivas Reddy Brother Son Lohith Reddy Marriage: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డికి త్వరలో వివాహం జరగబోతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను కలిసి ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అందులో భాగంగానే నిన్న గవర్నర్ తమిళిసైని రాజభవన్ లోని ఆమె నివాసంలో కలిసి వివాహానికి సతి సమేతంగా ఆహ్వానించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఈరోజు ఆయన జూనియర్ ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ను సైతం ఈ వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ శుభలేఖను అందజేశారు.
ఇక కొద్ది రోజుల క్రితం దిల్ రాజు కుమారుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి వివాహానికి కూడా హాజరు కావాల్సిందిగా దిల్ రాజు తన సోదరుడు శిరీష్ తో కలిసి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. పూర్తి స్థాయి సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. శ్రీకాంత్ సహా పలువురు తెలుగు నటీనటులు ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాతి సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఎన్టీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఆయన కూడా ఈ సినిమా మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.