‘శేఖర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జీవిత రాజశేఖర్ తన కూతుళ్ళ గురించి చెప్తూ.. ఓ కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘తాను ఆర్డర్ చేసిన ఫుడ్ సరిగ్గా లేకపోతే, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేంతవరకూ శివాని స్విగ్గీ వాళ్ళని వదిలిపెట్టదని, ఆ అమ్మాయి కోమటిదాని లెక్క’ అంటూ జీవిత వ్యాఖ్యానించారు. ఇవి ఆర్యవైశ్యుల్ని కించపరిచేలా ఉండడంతో.. ఆ వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కులానికి పిసినారి తనాన్ని ఆపాదించేలా జీవిత కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు జీవిత మీడియా ముందుకొచ్చారు. తాను ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, చిన్నప్పటి నుంచి వింటున్న నానుడినే సాధారణంగా చెప్పానని అన్నారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా కించపరిచి ఉంటే, అందుకు క్షమాపణలు చెప్తున్నానన్నారు. తన మీద వచ్చినన్ని వార్తలు – వివాదాలు ఎవరి మీద రావని చెప్పిన జీవిత.. ఇదే సమయంలో గరుడ వేగ వివాదం గురించి ప్రస్తావించారు. గరుడ వేగ నిర్మాతలైన కోటేశ్వరరావు, హేమ.. సినిమాకి సంబంధించిన డబ్బులన్నీ తీసుకున్నారని, కానీ వాళ్ళు మీడియా ముందుకొచ్చి రాజశేఖర్ దంపతులు రూ. 26 కోట్లు మోసం చేశారని ఆరోపణలు చేశారన్నారు. నిజానికి.. తాము కూడా ప్రొడక్షన్‌లో సగం డబ్బులు ఆస్తులమ్మి మరీ పెట్టామని చెప్పారు.
ఆ విషయాలు తెలుసుకోకుండా, తాము మోసం చేసినట్టుగా వరుసగా మూడు, నాలుగు రోజులు వార్తలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వద్ద సాక్ష్యంగా చెక్ ఉందని తెలిపారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో నడుస్తోందని, కోర్టులో తేలకముందే ఏదేదో చెప్తున్నారని జీవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాము నిజంగానే తప్పు చేశామని తేలితే, ఏ శిక్ష విధించినా తాము అంగీకరిస్తామని చెప్పారు. అలాగే.. గతంలో శివాత్మిక తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయినట్లుగా వచ్చిన వార్తల్ని గుర్తు చేసుకున్నారు. తామంతా కలిసి దుబాయ్‌కి వెళ్తే.. నా కూతురు లేచిపోయిందని అసత్య ప్రచారాలు చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తే ఎంత మంది జీవితాలు ప్రభావితం చేస్తాయని జీవిత ప్రశ్నించారు.