దళపతి విజయ్ అభిమానులకు ఇది కోలుకోలేని దెబ్బ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణ చిత్ర యూనిట్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఈ పరిణామం టాలీవుడ్‌లో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రానికి అనూహ్యంగా కలిసొచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రాకముందు నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదలపై సందిగ్ధత వీడలేదు. సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో జాప్యం జరుగుతోందని చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో నేడు విచారణ జరగగా కోర్టు వెల్లడించిన నిర్ణయం “ఆపరేషన్ సక్సెస్.. కానీ పేషెంట్ డెడ్” అన్న చందంగా మారింది.
సినిమాను జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, హైకోర్టు తన తుది తీర్పును కూడా అదే రోజున (జనవరి 9న) ఉదయం వెల్లడిస్తామని స్పష్టం చేసింది, సాధారణంగా సినిమా విడుదల కావాలంటే అంతకుముందే సెన్సార్ పూర్తి చేసుకుని, థియేటర్లకు డిజిటల్ కీస్ పంపాల్సి ఉంటుంది. కానీ విడుదల రోజు ఉదయం వరకు సర్టిఫికేట్ రాకపోతే, ఆ రోజు సినిమా థియేటర్లలోకి రావడం అసాధ్యం. దీనివల్ల తెలుగు, హిందీ వెర్షన్ల విడుదల జనవరి 9న నిలిచిపోయినట్లే, తమిళ వెర్షన్ విషయంలో నిర్మాతలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ఇక ఈ పరిణామం తెలుగు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ సినిమాకు భారీ అడ్వాంటేజ్‌గా మారింది, ఎందుకంటే సంక్రాంతి రేసులో ‘జన నాయకుడు’ గట్టి పోటీ ఇస్తాడని భావించగా, ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటంతో తెలుగు రాష్ట్రాల్లో ‘ది రాజా సాబ్’ సోలో రిలీజ్ పొందే అవకాశం లభించింది.