ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ చివరి అంకానికి చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లోకి మాజీ కంటెస్టెంట్లు వస్తూ సందడి చేస్తున్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ అందించేందుకు బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ హౌస్‌లోకి వచ్చి సరదాగా కంటెస్టెంట్లతో ముచ్చట్లు చెప్పాడు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం బిగ్‌బాస్ ఆదేశాల మేరకు ఐదుగురు సభ్యుల మధ్య పోటీని నిర్వహించాడు. అఖిల్, బిందుమాధవి, అనిల్, బాబా భాస్కర్, అరియానా ఈ పోటీలో పాల్గొన్నారు. అయితే ఈ పోటీలో బాబా భాస్కర్ గెలుపొందడంతో ఆయనకు ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను వీజే సన్నీ అందజేశాడు.
ఈ టాస్క్ ముగిసిన తర్వాత సన్నీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లతో సరదాగా గడిపాడు. అనంతరం బిగ్‌బాస్ బాలయ్య సాంగ్ ప్లే చేయగా సన్నీతో పాటు కంటెస్టెంట్లు స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకి జై బాలయ్య, జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. దీంతో హౌస్ హోరెత్తిపోయింది. అటు సన్నీ వెళ్తూ వెళ్తూ కూడా బాలయ్య డైలాగ్ చెప్పాడు. అయితే హౌస్‌లో అందరూ బాగా ఆడుతున్నారని.. టఫ్ ఫైట్ నెలకొందని సన్నీ అభిప్రాయపడ్డాడు. కాగా ఆదివారం నాటి ఎపిసోడ్‌లో హౌస్ నుంచి అషూరెడ్డి ఎలిమినేట్ అయ్యింది. బాబా భాస్కర్ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను వాడకపోవడంతో అషూరెడ్డి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు.