తెలుగు చిత్రసీమలో కళావాచస్పతి జగ్గయ్య హీరోగా రాణించారంటే అందుకు దర్శకనిర్మాత కె.బి.తిలక్ ప్రధానకారకులని చెప్పకతప్పదు. తిలక్ తమ ‘అనుపమ ఫిలిమ్స్’ పతాకంపై తెరకెక్కించిన అనేక చిత్రాలలో జగ్గయ్యనే కథానాయకునిగా ఎంచుకున్నారు. అలా వారి కాంబోలో తెరకెక్కిన ‘ఈడూ-జోడూ’ చిత్రం అప్పట్లో జనాదరణ పొందింది. 1963 మే 17న ‘ఈడూ-జోడూ’ విడుదలై విజయం సాధించింది.
Read Also: Girl’s mind: అమ్మాయిల విషయంలో పురుషులు చేసే తప్పు ఏంటో తెలుసా?
ఇంతకూ ‘ఈడూ-జోడూ’ కథ ఏమిటంటే – సుందరమ్మ తన కొడుకు డాక్టర్ వేణుతో కలసి పట్నం నుండి పల్లెకు వస్తుంది. అక్కడ ఆమె చిన్ననాటి స్నేహితురాలు కూతురు శాంత ఉంటుంది. వేణు, శాంత చిన్నప్పుడు కలసి ఆడుకొని ఉంటారు. సుందరమ్మ, శాంతను తన కోడలు చేసుకుంటానని చిన్నప్పుడు చెప్పి ఉంటుంది. కానీ, ఆమె కొడుకు డాక్టర్ కాగానే, వేరే సంబంధం చూడాలని ఆశిస్తుంది. రంగమ్మ తన కూతురును వేణుకు ఇవ్వాలని చూస్తుంది. కానీ ఆ అమ్మాయి, తన బావను ప్రేమించి ఉంటుంది. శాంత తల్లి చనిపోవడంతో ఒక్కతవుతుంది. ఆమెను ఆ ఊరిలో పేరు మోసిన షావుకారు లక్ష్మీపతికి ఈడూజోడూ కాకున్నా ఇచ్చి పెళ్ళి చేస్తారు. కానీ, తాగిన మైకంలో ఉన్న లక్ష్మీపతికి తరువాత నిజం తెలుస్తుంది. అతను ఊరిలో ఆసుపత్రి కట్టిస్తాడు. అతని ఆసుపత్రిలోనే వేణు పనిచేయాలని ముందుగానే నిర్ణయించి ఉంటారు. వేణు, శాంత వేరేవారిని పెళ్ళి చేసుకుందని విచారిస్తాడు. కానీ, చివరకు రంగమ్మనే చీకటిలో తాళి కట్టి, అది లక్ష్మీపతి కట్టాడని లోకాన్ని నమ్మించి ఉంటుంది. అదే తీరున వేణు, రంగమ్మ కూతురు పెళ్ళిలో లైట్లు ఆర్పేసి, చివరకు ఆమె కోరుకున్న బావతో పెళ్ళి జరిపిస్తారు. తరువాత అదే పీటలపై వేణు, శాంత పెళ్ళి దగ్గరుండి లక్ష్మీపతి చేయిస్తాడు. ఇది అన్యాయమని అరచిన ఊళ్ళో వాళ్ళకు రంగమ్మ చేసిన మోసం గురించి వివరిస్తాడు లక్ష్మీపతి. చివరకు విషయం తెలుసుకున్న సుందరమ్మ కూడా కొడుకు పెళ్ళి శాంతతో జరగాలనే ఆశిస్తుంది. ఆ రెండు జంటలు ఈడూజోడూ కుదిరిందని లక్ష్మీపతి అంటూ ఆశీర్వదించడంతో కథ సుఖాంతమవుతుంది.
Read Also:DK Shivakumar: నన్ను కర్ణాటక సీఎం చేయండి.. కోరికను ఖర్గేకు తెలిపిన డీకేఎస్!
ఇందులో జమున నాయికగా నటించగా, గుమ్మడి, చలం, మణిమాల, రమణారెడ్డి, చదలవాడ, కేవీయస్ శర్మ, సూర్యకాంతం, హేమలత, మాలతి, లక్ష్మీకాంతమ్మ, అల్లు రామలింగయ్య ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి కథ, మాటలు పినిశెట్టి సమకూర్చగా, పాటలు ఆరుద్ర రాశారు. పెండ్యాల నాగేశ్వరరావు బాణీలు కట్టారు. ఇందులోని “ఇదేమి లాహిరి…ఇదేమి గారడీ…”, “చిరుగాలి వంటిది అరుదైన చిన్నది…”, “విష్ణుపదము మేము విడువము…”, “సూర్యుని చుట్టూ తిరుగుతువుంది భూలోకం…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తిలక్ నిర్మించారు. ఈ చిత్రం విజయం సాధించడంతో హిందీలో సంజీవ్ కుమార్, మాలా సిన్హాతో ‘కంగన్’ పేరుతో తిలక్ రూపొందించారు.