DK Shivakumar: కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తనకు తల్లి లాంటిదని, వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడనని హస్తినకు వెళ్లటానికి ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణమని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, శివకుమార్‌లు కూడా పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో విడివిడిగా భేటీ అయ్యారు. కాగా, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధరామయ్య వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం ఎంపికపై పార్టీ అధిష్ఠానం బుధవారం నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఉన్న కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. 2019లో తమ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించేందుకు తాను సహాయం చేశానని, శివకుమార్ తదుపరి సీఎం కావాలనే కోరికను ఖర్గేకు తెలియజేశారు.
మే 10న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరూ కాంగ్రెస్ నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఖర్గేతో జరిగిన సమావేశంలో సిద్ధరామయ్యకు సీఎం అయ్యే అవకాశం ఇప్పటికే లభించిందని, ఇప్పుడు తన వంతు వచ్చిందని శివకుమార్ కాంగ్రెస్ చీఫ్‌తో చెప్పారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తనకు సీఎం కుర్చీ దక్కకపోతే పార్టీలో ఎమ్మెల్యేగా మాత్రమే పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తానని కూడా చెప్పారు. సిద్ధరామయ్య సీఎంగా కొనసాగడం ‘తప్పుడు పాలన’ అని, కర్ణాటకలోని ప్రముఖ వర్గమైన లింగాయత్‌లు మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారని శివకుమార్ ఖర్గేతో అన్నారు.
Read Also: Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీలతో రహస్య ఓటింగ్ ఫలితాలపై చర్చించిన తర్వాత కర్ణాటక తదుపరి సీఎంను కాంగ్రెస్ చీఫ్ నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ ప్రస్తుతం సిమ్లాలో ఉన్నారు. సోమవారం, కర్ణాటకకు చెందిన ముగ్గురు పరిశీలకులు ఖర్గేకు తమ నివేదికను సమర్పించారు. పార్టీ నేతల సమావేశం ఐదు గంటలకు పైగా కొనసాగింది. ఇద్దరు బలమైన నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశిస్తుండటం వల్ల ఎవరికి పట్టం కట్టాలనే విషయమై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని ఎంపిక చేసినా మరొకరు అసంతృప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, అధికార బీజేపీ 66 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. రాష్ట్రంలో కింగ్‌మేకర్‌గా అవతరించాలని భావించిన జేడీ(ఎస్) 19 స్థానాలకు పరిమితమైంది.