Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. నేడు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నాడు. లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరు తిని వెళ్ళారా..? అన్నది కూడా పట్టించుకుంటున్నాడు. అభిమానులతో పాటు మొగల్తూరుకు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇక తాజాగా కృష్ణంరాజు కోసం సీఎం జగన్ కీలక నిర్ణయంతీసుకున్నారు. నేడు మొగల్తూరు లో కృష్ణంరాజు ఇంటికి వచ్చి కుటుంబ మంత్రులు ఈ విషయాన్నీ మీడియా ముఖంగా తెలిపారు. నర్సాపురం పేరుపాలెం బీచ్ లో కృష్ణంరాజు స్మృతి వనాన్ని నిర్మించనున్నట్లు జగన్ ప్రకటించారు.
ఏపీ ప్రభత్వం తరుపున రెండెకరాల స్థలాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ మంత్రులు సైతం ప్రకటించారు. కుటుంబ సభ్యులు కోరుకున్న చోట భూమి ఇచ్చేందుకు సిద్ధమని, కృష్ణంరాజు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. రెండు మూడు స్థలాలు ఇప్పటికే కలెక్టర్ చూశారని, అందులో ఒకటి కుటుంబ సభ్యులు ఓకే చేస్తే ఆయన గుర్తుగా విగ్రహం పెట్టించి దాన్ని పర్యాటక స్థలంగా మారుస్తామని తెలిపారు. ఇక ఈ విషయమై ఉప్పలపాటి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే కృష్ణంరాజు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి పనులు మొదలుపెట్టనున్నారని సమాచారం.