‘మనసంతా నువ్వే’, ‘నేనున్నాను’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన వి.ఎన్. ఆదిత్య తాజాగా తెరకెక్కించిన సినిమా ‘వాళ్లిద్దరి మధ్య’. శుక్రవారం నుండి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రీమియర్ షో అనంతం చిత్ర బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ, ”ఈ సినిమాకు పడినంత టెన్షన్ నా గత చిత్రాలకు ఎప్పుడూ పడలేదు. 2011లో ‘ముగ్గురు’ సినిమా తర్వాత కొంతకాలం నేను యూఎస్ కు వెళ్ళాను. అక్కడ నుండి వచ్చేసరికీ ఇక్కడ సినిమా రంగంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు దర్శకత్వం వహించడం నావల్ల కాదనే నిర్ణయానికి వచ్చేశాను. ఓ సినిమాను తీసినా విడుదల చేయడానికి ఎలాంటి కష్టాలు పడాలో కదా అనిపించేది. అటువంటి సమయంలో నిర్మాత అర్జున్ దాస్యన్ నన్ను ప్రోత్సహించి, నాతో ఈ సినిమా నిర్మించారు. నిజానికి దీని తర్వాత చేసిన ‘డియర్ మేఘా’ చిత్రం విడుదలై పోయింది. మరో చిత్రమూ అతి త్వరలో విడుదల కాబోతోంది. మా సినిమా కూడా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను నిర్మించిన అలాంటి నిర్మాతను నేనింతవరకూ చూడలేదు. ఈ సినిమాను వ్యూవర్స్ ఆదరిస్తే… ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ మరిన్ని వస్తాయి. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణకు మంచి గుర్తింపు వస్తుంది. అలానే మధు స్రవంతి ఈ సినిమాకు చక్కని సంగీతం సమకూర్చారు. ఆమె బలమైన కోరిక కారణంగా బాలు గారు ఇందులో ఓ పాట పాడారు. అది జీవితంలో మర్చిపోలేని విషయం. ఈ చిత్ర నిర్మాణంలో మాకు ప్రసాద్స్ అధినేత రమేశ్ ప్రసాద్ చక్కని సహకారం అందించారు” అని అన్నారు.
తాను సినిమా చేయమని కోరిన వెంటనే వి.ఎన్. ఆదిత్య అంగీకరించలేదని, దాదాపు మూడు నెలల పాటు తాను సినిమా పూర్తి చేయగలనా లేదా అని పరీక్షించారని, జనాలకు ఈ చిత్రం నచ్చుతుందనే నమ్మకం ఉందని నిర్మాత అర్జున్ అన్నారు. నటుడిగా తనకిది రెండో సినిమా అని, అందులో రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ఛాలెంజ్ గా తీసుకున్నానని, అందరి సహకారంతో సినిమాను పూర్తి చేశామని హీరో విరాజ్ అశ్విన్ తెలిపారు. ఆహా ద్వారా ఈ సినిమాను జనం ముందుకు తీసుకురావడం పట్ల కంటెంట్ హెడ్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీజీ విందా హాజరయ్యారు. ఇందులో నటి జయశ్రీ రాచకొండ, మాటల రచయిత వెంకట్ డి. పతి తదితరులు పాల్గొన్నారు.