విజయ్ ఆంటోని పేరు వినగానే గుర్తుకు వచ్చే సినిమా ‘బిచ్చగాడు’. తెలుగునాట ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో విజయ్ ఆంటోని పేరు మారుమ్రోగిపోయింది. నిజానికి విజయ్ ఆంటోని నటుడు కాకముందే చక్కటి సంగీత దర్శకుడు. విజయ్, ధనుష్, విజయ్ కాంత్, జీవా, విశాల్ వంటి స్టార్స్ సినిమాలకే కాదు ‘అంగాడి తెరు’ (షాపింగ్ మాల్) వంటి చిన్న చిన్న సినిమాలకు చక్కటి సంగీతాన్ని అందించాడు. అయితే తను హీరోగా నటించిన ‘సలీమ్’ విజయంతో నటనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన ‘పిచ్చైకారన్’ (బిచ్చగాడు) సెన్సేషనల్ హిట్ తో తన సినిమాలకు మాత్రమే సంగీతాన్ని అందిస్తూ హీరోగా స్థిరపడిపోయాడు.
ఆ తర్వాత వచ్చిన విజయ్ ఆంటోని సినిమాలు ‘సైతాన్, యమన్, అన్నాదురై, కాళి, తిమ్మురు పుడిచవన్, కొలైకారన్, కొడియిల్ వరువన్’ అన్నీ కూడా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అయ్యాయి. అయితే వీటిలో ఏది సక్సెస్ మార్క్ ను అందుకోలేక పోయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడులా తమిళంతో పాటు తెలుగులోనూ తన సినిమాలను విడుదల చేస్తూ వస్తున్నాడు విజయ్ ఆంటోని. తాజాగా తమిళంలో తీస్తున్న ‘కొళై’ సినిమాను ‘హత్య’ పేరుతో తెలుగులో రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్ర పోషిస్తున్నాడు విజయ్ ఆంటోని. రితికా సింగ్ సంధ్య పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘1923లో జరిగిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంతో ఈ ‘హత్య’ తెరకెక్కుతోంది.
ఇప్పటికీ విజయ్ ఆంటోని తెలుగునాట ‘బిచ్చగాడు’ ఇమేజ్ తోనే కొనసాగుతున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. వీటిలో ఏదో ఒకటి సక్సెస్ కాకుంటే ‘బిచ్చగాడు’తో వచ్చిన ఇమేజ్ కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సో మొనాటనీ వీడి ‘బిచ్చగాడు’ తరహాలో అందరు ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాతో విజయ్ ఆంటోని రావాలని కోరుకుందాం.