ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్, హాసం సంపాదకులు స్వర్గీయ రాజా రాసిన ఆపాతమధురం -2 పుస్తకాన్ని ఆయన కుమార్తెలు శ్రేష్ఠ, కీర్తన ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణ సభ జనవరి 21, మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ – సన్ షైన్ హాస్పిటల్ లోని భవనం శ్రీనివాసరెడ్డి ఆడిటోరియంలో రస హృదయుల సమక్షంలో జరిగింది.
“ఆపాతమధురం -2″ పుస్తకాన్ని డాక్టర్ గురవారెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతిని ప్రముఖ సంగీతాభిమాని, విశ్లేషకులు జె. మధుసూదన శర్మకు అందచేశారు. అనంతరం డాక్టర్ గురవారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ, ” రాజా గారి ఆధ్వర్యంలో వచ్చిన హాసం పత్రిక అంటే నాకెంతో ఇష్టం. అలానే ఆయన నిర్వహించిన వెబ్ సైట్ అంటే కూడా నాకెంతో మక్కువ. దానిని పునరుద్ధరించాల్సిందిగా వారి పిల్లలను కోరుతున్నాను. నాకు తెలిసి రాజా… తెలుగువారికి బినాకా గీత్ మాల అమీన్ సయానీ లాంటి వారు. ఆయన రాసిన ఆపాత మధురం తొలి భాగాన్ని నేను, పామర్రులోని నా స్నేహితురాలు డాక్టర్ భార్గవితో కలిసి ప్రచురించాను. ఇలా పుస్తకాలను ప్రచురించాలనే కోరిక నాకు మా బావ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి నుండి అబ్బింది. రాజా గారు మరికొంతకాలం మనతో ఉండి ఉంటే 1971 వరకూ వచ్చిన పాటలను కూడా విశ్లేషించి ఉండేవారు. కనీసం ఆ పనిని మధుసూదనశర్మ గారు చేస్తే, దానిని పుస్తకంగా తీసుకొచ్చే బాధ్యతను నేను స్వీకరిస్తాను” అని అన్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ మాట్లాడుతూ, `పాట ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే వివరాలను `పాట అనే కార్యక్రమం ద్వారా అందించాలని అనుకున్నాను. అందుకు నాకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాజా గారు మాట ఇచ్చారు. కానీ దానిని నెరవేర్చకుండానే ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోయారు“ అంటూ వాపోయారు. ఇప్పుడు ఇక్కడ మన మధ్య ఉన్న మధుసూదన శర్మ గారైనా… నెక్ట్స్ జనరేషన్ కు తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాలని ఆర్.పి. పట్నాయక్ కోరారు.