(మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు)
నితిన్ చిత్రసీమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగడం విశేషం. పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు నితిన్.అదే నితిన్ బాణీ అని చెప్పవచ్చు. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్ ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆరంభంలోనే వరుస విజయాలు చవిచూసిన నితిన్ కు ఆ తరువాత సక్సెస్ దూరంగా జరిగింది. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తన దరికి చేరిన ప్రతీ అవకాశాన్నీ వినియోగించుకొనే ప్రయత్నం చేశారు నితిన్. గళం విప్పి గాయకుడూ అయ్యారు. నిర్మాతగా మారి ఇతరులతోనూ చిత్రాలు నిర్మించారు. ఈ యేడాది మాచర్ల నియోజకవర్గం
లో కలెక్టర్ పాత్రలో అలరించనున్నారు నితిన్.
నితిన్ కుమార్ రెడ్డి 1983 మార్చి 30న జన్మించారు. ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి తెలంగాణలో పేరున్న సినిమా డిస్ట్రిబ్యూటర్. నితిన్ వయసు వాడే అయిన జూనియర్ యన్టీఆర్ హీరోగా ప్రవేశం చేసిన తరువాత పలువురు నిర్మాతలు, దర్శకులు తమ వారసులను కూడా నటులుగా చేశారు. అదే తీరున నితిన్ నటనాభిలాషను గమనించిన సుధాకర్ రెడ్డి కూడా తనయుడిని హీరోని చేయాలని తపించారు. అప్పట్లో యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ చిత్రాలు తెరకెక్కస్తున్నాడు. అప్పటికే రెండు బంపర్ హిట్స్ పట్టేసిన తేజ, తన మూడో చిత్రంగా ‘జయం’ను తెరకెక్కించే ప్రయత్నంలో నితిన్ ను కథానాయకునిగా ఎంచుకున్నారు. ఆ సినిమా సమయంలో నితిన్ వయసు పందొమ్మిదేళ్ళు. టీనేజ్ లవ్ స్టోరీతో రూపొందిన ‘జయం’ టైటిల్ కు తగ్గట్టే సక్సెస్ ను సాధించింది. తొలి చిత్రంతోనే నితిన్ కు లవర్ బోయ్ ఇమేజ్ దక్కింది.
నితిన్ హీరోగా రూపొందిన రెండవ చిత్రం ‘దిల్’. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రాజు, ఈ సినిమా సక్సెస్ తరువాత దిల్ రాజుగా పేరొందారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా దిల్ రాజు ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు చిత్రపరిశ్రమలో కీ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలోనూ నితిన్ చాక్ లెట్ బోయ్ ఇమేజ్ తోనే సాగారు. తరువాత కృష్ణవంశీ ‘శ్రీఆంజనేయం’ నితిన్ కు నటునిగా మంచి మార్కుల సంపాదించి పెట్టింది. ఆపై రాజమౌళి ‘సై’తోనూ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా ఆకట్టుకున్నారు నితిన్.
ఈ చిత్రాల తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అల్లరి బుల్లోడు’గా ద్విపాత్రాభినయంతో అలరించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత నుంచీ వరుసగా ఫ్లాపులు పలకరించాయి. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘అగ్యాత్’తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టారు నితిన్. లాభం లేకపోయింది. మరో మూడు చిత్రాలు జనాన్ని ఆకట్టుకోలేకపోయినా, నితిన్ నిరాశ చెందలేదు. తన తండ్రి సుధాకర్ రెడ్డి, విక్రమ్ గౌడ్ తో కలసి నిర్మించిన ‘ఇష్క్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చారు నితిన్. “గుండె జారి గల్లంతయ్యిందే” కూడా జనాన్ని ఆకట్టుకుంది. ఈ రెండు చిత్రాలలో నితిన్ పాటలు పాడి అలరించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు నితిన్ వీరాభిమాని. తన అభిమాన హీరో పాటలను రీమిక్స్ చేసి నటించీ మురిసిపోయారు నితిన్. ‘ఇష్క్’ తరువాత నితిన్ హీరోగా రూపొందిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రంలో పవన్ ‘తొలిప్రేమ’లోని “ఏమయిందో ఈ వేళ…” సాంగ్ ను రీమిక్స్ చేసి నటించి మురిపించారు. అసలు ఈ సినిమా టైటిల్ తన హీరో నటించిన ‘గబ్బర్ సింగ్’లోని ఓ పాటలోని మకుటం కావడం మరింత విశేషం.
తన అభిమాని నితిన్ సక్సెస్ సాధించాలని పవన్ కళ్యాణ్ మనస్పూర్తిగా కోరుకున్నారు. తన ఆప్తమిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్ నటించేలా చేశారు. త్రివిక్రమ్ సొంత సంస్థగా భావించే ‘హారిక అండ్ హాసిని’ బ్యానర్ లో నితిన్ తో ‘అ ఆ’ తీశారు. అది అనూహ్య విజయం సాధించింది. ఆ తరువాత నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలసి ‘ఛల్ మోహనరంగ’ చిత్రం నిర్మించారు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది.
హారిక అండ్ హాసిని సంస్థకు అనుబంధ సంస్థ అయిన ‘సితారా ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మించిన ‘భీష్మ’లోనూ నితిన్ నటించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సంస్థ నిర్మించిన ‘రంగ్ దేలోనూ నితిన్ సందడి చేశారు. గత సంవత్సరం మూడు చిత్రాలలో కనిపించారు నితిన్. అయినా, అవి అంతగా మురిపించలేదు. రాబోయే
మాచర్ల నియోజకవర్గం` సినిమాపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో కలెక్టర్ గా తొలిసారి నటిస్తున్నారు. మరి ఈ సినిమాతో నితిన్ ఏ రీతిన ఆకట్టుకుంటారో చూడాలి.