(మార్చి 23న శ్రీకాంత్ పుట్టినరోజు)
సినిమా రంగం అంటే ఎంతోమందికి మోజు. అక్కడ రాణించాలని, తారాపథంలో సాగిపోవాలని ఎంతోమంది కలలుకంటూ ఉంటారు. ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. ఏదైనా సినిమా చూసి, అందులో తనకు నచ్చిన పాత్రను తానయితే ఇలా చేస్తాననీ కలల్లో తేలిపోతారు. అయితే స్వప్నాలను సాకారం చేసుకొనేవారు కొందరే ఉంటారు. చిత్రసీమలో అలాంటివారికి కొదువలేదు. వారిలో నిన్నటి హీరో, నేటి కేరెక్టర్ యాక్టర్, విలన్ శ్రీకాంత్ కూడా ఉన్నారు. బిట్ రోల్స్ లో మొదలైన శ్రీకాంత్ సినీ ప్రయాణం, స్టార్ హీరోగా ఎదిగేంత వరకూ సాగింది. ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్న శ్రీకాంత్, అడపాదడపా హీరో పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.
కృష్ణాజిల్లా మేకావారి పాలెం నుండి కర్ణాటకలోని గంగావతికి మకాం మార్చిన మేకా పరమేశ్వరరావుకు పెద్దకొడుకు శ్రీకాంత్. 1968 మార్చి 23న శ్రీకాంత్ గంగావతిలో జన్మించారు. బళ్ళారి, దార్వాడలో చదువు సాగించిన శ్రీకాంత్ అప్పటి నుంచీ సినిమాలపై మోజు పెంచుకున్నారు. హైదరాబాద్ మధు ఫిలిమ్ అండ్ టీవీ ఇన్ స్టిట్యూట్ లో చేరి, నటనలో శిక్షణ తీసుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’లో తొలిసారి శ్రీకాంత్ తెరపై కనిపించారు. ఆ తరువాత నుంచీ తన దరికి చేరిన పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగారు. ఆ క్రమంలో కేరెక్టర్ యాక్టర్ గా, విలన్ గానూ అలరించారు. ‘వన్ బై టు’లో జెడి చక్రవర్తితో కలసి హీరోగా నటించిన శ్రీకాంత్ కు తరువాత “ఆమె, తాజ్ మహల్” చిత్రాలు హీరోగా గుర్తింపునిచ్చాయి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్ళిసందడి’ అనూహ్య విజయం సాధించింది. దాంతో శ్రీకాంత్ స్టార్ హీరోగా మారిపోయారు. “వినోదం, తాళి, ఎగిరే పావురమా, మా నాన్నకు పెళ్ళి, ఊయల, కన్యాదానం, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, చాలాబాగుంది, తిరుమల తిరుపతి వెంకటేశ, ఖడ్గం” వంటి చిత్రాలలో హీరోగా అలరించారు శ్రీకాంత్. చిరంజీవితో కలసి ‘శంకర్ దాదా ఎమ్.బి.బి.యస్’, శంకర్ దాదా జిందాబాద్” చిత్రాల్లో నటించారు. బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం, అఖండ’ సినిమాల్లో అభినయించారు. ‘మహాత్మ’తో వంద చిత్రాల మైలు రాయి దాటిన శ్రీకాంత్ ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అందరితోనూ శ్రీకాంత్ కలసి నటించి అలరించారు. ఇప్పుడు నవతరం నాయకులతోనూ సరదాగా నటించేస్తూ సాగిపోతున్నారు. తెలుగులోనే కాకుండా, కన్నడ, తమిళ, మళయాళ చిత్రాలలో నటిస్తున్నారు శ్రీకాంత్. ఓ వైపు గుణచిత్ర నటునిగా సాగుతున్న శ్రీకాంత్, మరోవైపు తనయుడు రోషన్ కెరీర్ ను డిజైన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. రోషన్ హీరోగా ఆ మధ్య ‘పెళ్ళిసందD’విడుదలయింది. తనయుడు రోషన్ శ్రీకాంత్ కు మరింత ఉత్సాహం కలిగిస్తాడని సన్నిహితులు అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ తనకు నచ్చిన పాత్రల్లో శ్రీకాంత్ నటిస్తూనే సాగుతూ ఉన్నారు.