నటశేఖర కృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.ఆర్. దాస్ తెరకెక్కించిన అనేక చిత్రాలు మాస్ ను విశేషంగా అలరించాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘హంతకులు – దేవాంతకులు’. ఎస్.ఆర్.కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం 1972 జూన్ 2న విడుదలై జనాన్ని ఆకట్టుకుంది.
‘హంతకులు – దేవాంతకులు’ కథ ఏమిటంటే – రాజేశ్ సి.ఐ.డి. – అచ్చు అతనిలాగే ఉండే అతని అన్నను, అతని తల్లిని బలరామ్, లైలా, ప్రేమ్ అనే దుండగులు చంపేసి, డబ్బు దోచుకుంటారు. ఉద్యోగ ధర్మమే ముఖ్యమని ఆఫీసుకు వెళతాడు రాజేశ్. అతనికే హంతకులను పట్టుకొనే డ్యూటీ అప్పచెబుతారు. రాజేశ్ తల్లిని చంపిన వారు ధనవంతుల వివరాలు సేకరించడం, తమ మాయమాటలతోనూ, నాటకాలతోనూ వారిని బురిడీ కొట్టించడం, డబ్బులు కాజేయడం చేస్తూ ఉంటారు. అలా ఓ జమీందార్ ను, ఆయన ముగ్గురు కూతుళ్ళను కూడా మాయ చేస్తారు. ఆ జమీందార్ ను చంపేసి, తరతరాలుగా వస్తోన్న బంగారు కిరీటాన్ని ప్రేమ్, లైలా కాజేస్తారు. జమీందార్ పెద్దమ్మాయి రాజేశ్ ను ప్రేమిస్తుంది. ఆ జమీందార్ మేనల్లుడు నాగు తమాషాలు చేసినా, ఎంతో తెలివైన వాడు. ఆ ముగ్గురమ్మాయిలు, వాళ్ళ బావ కలసి మారు వేషాలు వేస్తూ హంతకులను వెంటాడుతారు. జమీందార్ పెద్దకూతురు చేతిలో ప్రేమ్ చస్తాడు. లైలా ఆ కిరీటాన్ని దాచిపెట్టిన సంగతి బలరామ్ కు తెలుస్తుంది. ఆ కిరీటం లైలా, బలరామ్ తీసుకు వెళ్తుండగా రాజేశ్ వచ్చి అడ్డుకుంటాడు. లైలా పోరాటంలో చస్తుంది. బలరామ్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. రాజేశ్, జమీందార్ పెద్దమ్మాయి ఒక్కటవ్వడంతో కథ ముగుస్తుంది.
అప్పటికే ఐటమ్ గాళ్ గా సూపర్ స్టార్ డమ్ చూస్తోన్న జ్యోతిలక్ష్మి ఈ సినిమాలో కృష్ణ సరసన నాయికగా నటించడం విశేషం! తరువాతి రోజుల్లో రెబల్ స్టార్ గా జేజేలు అందుకున్న కృష్ణంరాజు ఇందులో ప్రతినాయకునిగా కనిపించారు. మిగిలిన పాత్రల్లో నగేశ్, సత్యనారాయణ, త్యాగరాజు, కేవీ చలం, ముక్కామల, రాజసులోచన, అనిత, జయకుమారి, షబ్నమ్, నిర్మల, జి.వి.జి, భీమరాజు నటించారు. తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకులైన విజయబాపినీడు కథ సమకూర్చగా, దాసరి నారాయణరావు మాటలు రాశారు. సత్యం స్వరకల్పన చేయగా, రాజశ్రీ, దాశరథి పాటలు పలికించారు. యన్.వి.సుబ్బరాజు, యమ్.కె.రాధ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని “ఇది లక్కీ లక్కీ ఆట…”, “చినుకు పడుతున్నది…”, “అడుగులు కదిపి ఆడలేను…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ సినిమాలో హీరోతో సమానంగా హీరోయిన్ కూ ఫైట్స్ ఉండడం విశేషం! నగేశ్ ఇందులో పలు గెటప్స్ లో మురిపించడం జనాన్ని ఆకట్టుకుంది.