సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘గల్లీ రౌడీ’. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా నిర్మాతలు కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించారు కూడా! కానీ ఇప్పుడు ఆ తేదీన పలు చిత్రాలు విడుదల కానుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు తెలిపారు. నిజానికి సెప్టెంబర్ 3న ‘గల్లీ రౌడీ’తో పాటు మరో రెండు మూడు సినిమాలూ విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో అవసరాల శ్రీనివాస్ ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘డియర్ మేఘ’, ‘కార్తీక్స్ ది కిల్లర్’ చిత్రాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే గోపీచంద్ మూవీ ‘సీటీమార్’ కూడా సెప్టెంబర్ 3నే వస్తుందనే ప్రకటన వచ్చిందో, ఆ వెంటనే’గల్లీ రౌడీ’ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు నిర్మాతలు. అయితే… సెప్టెంబర్ నెలలోనే తమ సినిమా విడుదల అవుతుందని, త్వరలోనే సరికొత్త తేదీని ప్రకటిస్తామని అన్నారు. రాజేంద్ర ప్రసాద్, బాబీ సింహా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.