బుల్లితెర నుండి వెండితెరపైకి వచ్చింది మలయాళ ముద్దుగుమ్మ రజిషా విజయన్. అలనాటి ప్రముఖ నటి షీలా కుమార్తె అయిన రజిషా ఇప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కర్ణన్’తో ఈ అమ్మడు కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా చక్కని విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. దీనిని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అతని తండ్రి సురేశ్ రీమేక్ చేయబోతున్నాడు. విశేషం ఏమంటే… రజిషా విజయన్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ దక్కించుకుందట. ‘కూతాతిల్ ఓరుతాన్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ సూర్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ చిత్రానికి రజిషాను హీరోయిన్ గా ఎంపిక చేశారట. 2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఇప్పుడు సూర్య చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అంథాలజీ ‘నవరస’తో పాటు హరి దర్శకత్వంలో ఓ సినిమాకు, పాండిరాజ్ దర్శకత్వంలో ఓ మూవీకి, వెట్రి మారన్ తో సినిమా చేయడానికి సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి టి.జె. జ్ఞానవేల్ మూవీ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి.