‘పక్కా కమర్షియల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన గోపీచంద్.. తొలుత ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే గతంలో సినిమాల కోసం చిరు పడిన కష్టాల గురించి వేదికపై చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో తాము స్టంట్స్ చేయాలంటే, టెక్నికల్ గా ఎన్నో అందుబాటులో ఉన్నాయని.. కానీ అప్పట్లో రోప్స్ లేకుండానే చాలా కష్టపడ్డారని, అందుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని అన్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనడానికి చిరు నిలువెత్తు నిదర్శనమని.. ఇప్పటికీ చాలామంది ఇండస్ట్రీలో రావడానికి ఆయనే ఆదర్శమని తెలిపాడు.
ఇక తన పక్కా కమర్షియల్ సినిమా గురించి మాట్లాడుతూ.. మొదట తనకు ఈ కథ వచ్చింది యూవీ క్రియేషన్స్ వంశీ వల్లేనని అన్నాడు. తను గనుక రిఫర్ చేయకపోయి ఉంటే, తాను ఇంత మంచి కథని మిస్ అయ్యేవాడినన్నాడు. తను ఫోన్ చేసి మారుతి వద్ద మంచి కథ ఉందని చెప్పడం వల్లే, ఈ సినిమా చేయగలిగానన్నాడు. తాను ఒక మంచి సినిమా చేయడంతో పాటు మారుతి రూపంలో ఒక మంచి వ్యక్తి కూడా పరిచయమయ్యాడని, అతనికున్న ట్యాలెంట్ కి కచ్ఛితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడని నమ్మకం అభిప్రాయపడ్డాడు. ఇక రాశీ ఖన్నా ఈ సినిమాలో చాలా బాగా నటించిందని, ఈ పాత్ర ఆమె కెరీర్ లోనే ఉత్తమంగా నిలుస్తుందని, కరెక్ట్ పాత్ర పడితే ఎలా చేయాలో అలా ఇరగదీసిందని కొనియాడాడు.
బన్నీ వాసు చేతిలో ఒక కథ పడితే, దాన్ని పర్ఫెక్ట్ గా సిద్ధం చేస్తారని.. అసలు వారి వద్దకు ఒక స్టోరీ వెళ్లిందంటే ఆ సినిమా దాదాపు 50 శాతం సక్సెస్ అయినట్టేనని గోపీచంద్ పేర్కొన్నాడు. అలాంటి నిర్మాతలతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇక టెక్నీషియన్స్ కూడా అద్భుతంగా పని చేశారని, సినిమాటోగ్రాఫర్ తనని చాలా బాగా చూపించారన్నాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, జులై 1వ తేదీన థియేటర్ కు అందరూ చూడాలని కోరుకుంటున్నానంటూ గోపీచంద్ తన ప్రసంగాన్ని ముగించాడు.