Gopichand: హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతోంది. గతంలో వీరి కాంబోలో ‘లక్ష్యం’ మొదటగా వచ్చింది. ఆ తర్వాత ఏడేళ్ళకు ‘లౌక్యం’ మూవీ వచ్చింది. ఈ రెండు సినిమాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. దాంతో తాజాగా వీరితో పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సినిమాను నిర్మిస్తున్నారు. ఇది గోపీచంద్ కు 30వ చిత్రం కావడం విశేషం. భూపతి రాజా కథను అందించిన ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోల్ కతాలో జరుగుతోంది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలియగానే కోల్ కతాలోని ఈ చిత్ర బృందం ఆయన చిత్ర పటానికి పూల మాలవేసి, నివాళులు అర్పించింది. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని టీమ్ సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా గోపీచంద్ టీమ్ కృష్ణ గారి కుటుంబానికి తీవ్ర సానుభూతిని వ్యక్తం చేసింది.