అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల విషయం ఇప్పుడప్పుడే అభిమానులు మర్చిపోయేలా కనిపించడంలేదు. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు మాత్రమే కలిసి ఉండి తరువాత విడాకులు తీసుకొని విడిపోయారు. వీరి మధ్య ఏం జరిగింది అనేది ఇప్పటికి మిస్టరీగానే ఉంది. కొంతమంది సామ్ ది తప్పు అంటే.. మరికొంతమంది చైతూ ది తప్పు అంటున్నారు. ఇంకొంతమంది నాగార్జున ఫ్యామిలీ ది అంటున్నారు. ఈ జంట విడాకులు తీసుకొని కొన్ని నెలలు గడుస్తున్నా వీరి గురించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపికే. ఇక తాజాగా చైతన్య నటించిన థాంక్యూ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన విషయం విదితమే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ట్రైలర్ లో చైతూ చెప్పిన డైలాగ్స్ అన్నీ సామ్ ను ఉద్దేశించినవే అని అభిమానులు నొక్కి వక్కాణిస్తున్నారు.
‘ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్చగా వదిలేసే ప్రేమ గొప్పది’ అని చైతూ ఎమోషనల్ డైలాగ్ సామ్ గురించే అని అంటున్నారు. వారి కాపురంలో కలతలు రావడానికి కూడా స్వేఛ్చ లేకపోవడమే కారణమని, ఈ కారణంగానే చైతూ, సామ్ ను వదిలేశాడని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా సామ్ ను ఈ ట్రైలర్ చూడమని, తమ అభిమాన హీరో నీ వలనే ఇంత బాధపడ్డాడని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోపక్క అభిమానుల అభిమానంతో ఏవేవో అంటున్నారు కానీ, నిజంగా చైతన్య అనేవాడు అయితే ఆయనకు సినిమాతో పని ఏమి ఉంది. ట్విట్టర్ లోనే డైరెక్ట్ గా చెప్పొచ్చు.. వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా వారి పనుల్లో వారు బిజీగా మారిపోయారు కానీ ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోలేదు.
డైలాగ్స్ అనేవాటిని సినిమా పరంగా చూసుకోవాలి కానీ, వాటిని నిజ జీవితానికి అన్వయించకూడదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా సామ్, చై సినిమాలు వచ్చిన ప్రతిసారి అభిమానులకు వీరి విడాకుల ఘటన గుర్తు రాకుండా మాత్రం పోదు అనేది వాస్తవం. తాము ఎంతో అభిమానించే జంట హఠాత్తుగా విడిపోవడం వలన వారు కూడా కొంతఆవేదనకు గురయ్యారు అనేది నమ్మదగ్గ నిజం. ఎంత ఆవేదన చెందినా వారికి నచ్చని విషయాన్నీ ఇలా ప్రతిసారి వారిపై రుద్దకూడదు.. ఇక విడాకుల విషాయాన్ని అభిమానులు మర్చిపోతే బావుంటుందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.