Double Dhamaka For Balakrishna Fans This Dussehra: దసరా కానుకగా అక్టోబర్ 5న చిరంజీవి, నాగార్జున సినిమాలు విడుదల కాబోతున్నాయి. అది మెగాభిమానులకు, అక్కినేని ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగించే అంశం. అయితే అంతకు మించి నందమూరి అభిమానులను అలరించే వార్త ఒకటి ఉంది. ఇరవై యేళ్ళ క్రితం సెప్టెంబర్ 25న బాలకృష్ణ, వి. వి. వినాయక్ తొలి కాంబినేషన్ వచ్చిన సినిమా ‘చెన్నకేశవరెడ్డి’. అప్పట్లో ఆ సినిమా భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు అదే చిత్రాన్ని సెప్టెంబర్ 24న వరల్డ్ రిలీజ్ చేశారు బెల్లంకొండ సురేశ్. ఇటు సింగిల్ థియేటర్లతో పాటు అటు మల్టీప్లెక్స్ లలోనూ ‘చెన్నకేశవరెడ్డి’ శనివారం హౌస్ ఫుల్ కలెక్షన్లతో హంగామా సృష్టించింది. ‘జై బాలయ్య… జైజై బాలయ్య’ అంటూ ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాను వీక్షించారు. ఇదిలా ఉంటే ఇదే రోజున బాలకృష్ణకు సంబంధించిన రెండు కొత్త విషయాలూ వారి ఆనందాన్ని రెట్టింపు చేయబోతున్నాయి.
దసరాకు కొత్త సినిమా పూజతో ప్రారంభం
బాలకృష్ణ తన 108వ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బాలయ్య బాబు బర్త్ డే సందర్భంగా వచ్చింది. సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మించే ఈ మూవీ పూజా కార్యక్రమాలు దసరా రోజున జరుగబోతున్నాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ లో మొదలు కానుంది. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ ప్రధానాంశంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు కూతురుగా ‘పెళ్ళిసందడి’ ఫేమ్ శ్రీలీల నటించబోతోంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ… మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నారు. టర్కీలో దీని చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 28న ఆయన టర్కీ నుండి ఇండియాకు వస్తారు. రాగానే ఆహా కోసం ‘అన్ స్టాపబుల్’ షూటింగ్ లో బాలకృష్ణ పాల్గొంటారు!
బాలయ్య ‘అన్ స్టాపబుల్’కు చిరంజీవి గెస్ట్!
ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన కార్యక్రమం ‘అన్ స్టాపబుల్’! బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలను సంధించి, గెస్టుల నుండి ఆసక్తికరమైన సమాధానాలను రప్పించి, ఈ షోను గ్రాండ్ సక్సెస్ చేశారు. మొదటి సీజన్ లో ఫస్ట్ గెస్ట్ గా మంచు మోహన్ బాబు పాల్గొన్నారు. ఆ సీజన్ లోనే మెగాస్టార్ చిరంజీవిని ఇంటర్వ్యూ చేయాలని బాలకృష్ణ ప్రయత్నించారు. కానీ అది సాధ్యపడలేదు. అందుకే ఈ సెకండ్ సీజన్ ను చిరంజీవితోనే మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ మూవీ సైతం అక్టోబర్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో ఆయన ఇంటర్వూకు ఇదే రైట్ టైమ్ అని ఆహా బృందం భావిస్తోందట. అన్నీ అనుకున్నట్టు జరిగితే అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ గెస్ట్ చిరునే! సో… మెగాస్టార్ చిరంజీవిని బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు… దానికి చిరంజీవి ఎలాంటి సమాధానాలు చెబుతారు అనేది తెలియాలంటే… కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే!