Disney Demanding Avatar 2 Screening In Sankranti: ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న జేమ్స్ కామెరూన్ తాజా చిత్రం ‘అవతార్2’. ఈ నెల 16న ఇండియాలో హిందీ, తెలుగు, తమిళ భాషలలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘అవతార్’ సెన్సేషనల్ హిట్ అయిన నేపథ్యంలో వస్తున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో విడుదలా కాబోతున్న ఈ సినిమా నిడివి 3 గంటల 12 నిమిషాలు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే టాక్ అఫ్ ద ఇండియాగా మారింది. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ అన్నింటిలో ఈ సినిమాను ప్రదర్శించటానికికే ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్లే వీకెండ్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ తో ఫుల్ అయిపోయాయి. బాక్సాఫీస్ అంచనాల ప్రకారం వీకెండ్ లోనే బాలీవుడ్ సినిమాలను మించి వసూలు చేస్తుందంటున్నారు.
ఇదిలా ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘అవతార్2’ మ్యానియా కనిపిస్తోంది. టిక్కెట్స్ కోసం భారీ స్థాయిలో వత్తిళ్ళను ఫేస్ చేస్తున్నారు థియేటర్ల యజమానులు. అయితే డిస్నీ సంస్థ ఎగ్జిబిటర్స్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయాలని భావించిన నిర్మాతలకు భారీ రేటును చెప్పటంతో ఎవరూ ముందుకు రాలేదు. దాంతో థియేటర్లలో తామే నేరుగా రిలీజ్ చేయటానికి రెడీ అయింది డిస్నీ. అయితే డిస్నీ డిమాండ్ కి ఎగ్జిబిటర్స్ సైతం షాక్ తింటున్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి భారీ షేర్ ఆఫర్ ఇస్తూ ఆకర్షిస్తున్న డిస్నీ సంక్రాంతి సీజన్ లోనూ తమ ‘అవతార్ 2’నే ప్రదర్శించాలనే షరతు విధిస్తోందట. అయితే తెలుగునాట సంక్రాంతికి మెగాస్టర్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’, బాక్సాఫీస్ బొనంజా బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ విడుదల కానుండటంతో ఈ షరతుకు థియేటర్ల వారు వెనకడుగు వేస్తున్నారట. మరి డిస్నీ పట్టువిడుపును ప్రదర్శిస్తుందా? లేక మొండిగా తన మాటకే కట్టుబడి ఉంటుందా? అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ తప్పదు అంటే మాత్రం అది డిస్నీకే నష్టం అవుతుందంటున్నారు బాక్సాఫీస్ విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి.