పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ ప్రభుత్వం సినిమా హాళ్ళలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘భీమ్లా నాయక్’ను ముందు అనుకున్నట్టు ఈనెల 25న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. దీంతో బాలెన్స్ షూటింగ్ ను వెంటనే పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాల్సిన పని దర్శకుడు సాగర్ చంద్ర కు ఉంది. ఇదిలా ఉంటే… ఇవాళ పవన్ కళ్యాణ్ ను ఆయన తదుపరి చిత్రాల దర్శకులు క్రిష్, హరీశ్ శంకర్ కలిశారు. ఈ ముగ్గురూ ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
పవన్ తో క్రిష్ ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్నాడు. దీని తాజా షెడ్యూల్ మార్చిలో మొదలు కానుంది. అలానే హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీని పవన్ కళ్యాణ్ తో చేస్తున్నాడు. దీని రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే… ‘భీమ్లా నాయక్’ మూవీ రిలీజ్ డేట్ ను 25కు ఖరారు చేయడంతో ‘గని’ చిత్ర నిర్మాతలు తమ చిత్రం విడుదల విషయంలో పునరాలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో చెప్పినట్టుగా ఈ నెల 25 కాకపోతే మార్చి 4వ తేదీన ‘గని’ రావడం ఖాయం.