Site icon NTV Telugu

Bobby : “ఆయన ఒక కర్మయోగి.. ఒక శిఖరం!”.. పవర్ స్టార్‌పై దర్శకుడు బాబీ ఎమోషనల్..

Pawan Kalyan

Pawan Kalyan

సినీ గ్లామర్, రాజకీయ అధికారం.. ఈ రెండూ మనిషిని మార్చేస్తాయని అంటుంటారు. కానీ, ఇవేవీ తన వ్యక్తిత్వాన్ని ఇంచు కూడా మార్చలేవని మరోసారి నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల ఆయనను కలిసిన ప్రముఖ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర), తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ రాసిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దర్శకుడు బాబీకి పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నుంచే మంచి అనుబంధం ఉంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న ఒక సామాన్యుడు కానీ నేడు ఆయన ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి. హోదా మారింది, బాధ్యత పెరిగింది.. కానీ ఆయనలోని ఆత్మీయత మాత్రం ఇసుమంతైనా తగ్గలేదని బాబీ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వెళ్తున్నప్పుడు తనలో ఒక తెలియని ఉద్వేగం కలిగిందని, తీరా అక్కడకు వెళ్ళాక చిరునవ్వులు చిందిస్తున్న ఒక ‘ఋషి’లా ఆయన కనిపించారని బాబీ భావోద్వేగానికి లోనయ్యారు.

Also Read:Raaka: అల్లు అర్జున్ రాకా’కు అర్ధమేంటో తెలుసా?

రాజకీయాల్లోకి రాగానే ఆస్తులు కూడబెట్టుకునే వ్యక్తులను మనం నిత్యం చూస్తుంటాం. కానీ, పవన్ కళ్యాణ్ అందుకు పూర్తి భిన్నమని బాబీ కొనియాడారు. “అన్ని సౌకర్యాలను వదులుకొని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు.” రాజకీయ నాయకుడిగా కంటే ఒక గొప్ప వ్యక్తిగా పవన్ కళ్యాణ్ తనపై చూపించిన ప్రేమకు తాను ఫిదా అయిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాబీ ఒక అద్భుతమైన పోలికను తీసుకువచ్చారు. జ్ఞానం కోసం రాజభోగాలను వదిలేసి అడవులకు వెళ్లిన గౌతమ బుద్ధుడి గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ, జనం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం తన సుఖాలన్నింటినీ త్యాగం చేసి నిరంతరం శ్రమిస్తున్న ఒక ‘కర్మయోగి’ని ఈరోజు ప్రత్యక్షంగా చూశానని బాబీ ప్రశంసల వర్షం కురిపించారు. “జైహింద్.. లవ్ యు ఆల్వేస్ మై పవర్ స్టార్” అంటూ బాబీ ముగించిన తీరు పవన్ కళ్యాణ్ పట్ల ఆయనకున్న అపారమైన గౌరవాన్ని, అభిమానాన్ని చాటి చెబుతోంది.

Exit mobile version