బెజవాడలో పుట్టి పెరిగిన డింపుల్ హయతీ టాలీవుడ్ మీదుగా కోలీవుడ్ నుండి బాలీవుడ్ కూ చేరింది. నటిగా, చక్కటి డాన్సర్ గా చక్కటి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ సూపర్ డూపర్ హిట్ మాత్రం అమ్మడి ఖాతాలో పడలేదు. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘గల్ఫ్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన డింపుల్ హయతీ ఆ తర్వాత ప్రభుదేవా ‘అభినేత్రి -2’లో నటించింది. ఇక దర్శకుడు హరీశ్ శంకర్ అయితే డింపుల్ హయతీ బాడీ లాంగ్వేజ్ కు ఫిదా అయిపోయి ‘గద్దలకొండ గణేశ్’తో ఆమెతో ఐటమ్ సాంగ్ చేయించాడు. ఆ తర్వాత ‘యురేక’ సినిమాలో నటించిన డింపుల్ హయతీ… ధనుష్, అక్షయ్ కుమార్, సారా అలీఖాన్ నటించిన హిందీ చిత్రం ‘అత్రంగీ రే’లోనూ కీలక పాత్రను పోషించింది. బట్…. ఆమెకు గ్రాండ్ సక్సెస్ ను మాత్రం ఏ సినిమా ఇవ్వలేకపోయింది.
Read Also : షాకింగ్ లుక్ లో ఇలియానా… నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
ఇక ఈ ఫిబ్రవరిలో డింపుల్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ కు బ్యాక్ రిలీజ్ కు వచ్చాయి. అందులో మొదటిది విశాల్ నటించిన ‘సామాన్యుడు’. ఇది 4వ తేదీ విడుదలైంది. కానీ కమర్షియల్ సక్సెస్ సాధించే ఎలిమెంట్స్ ఏవీ అందులో లేవని జనం పెదవి విరిచేశారు. డింపుల్ హయతీకి కూడా చెప్పుకోదగ్గ స్క్రీన్ స్పేస్ దక్కలేదని అనేశారు. దాంతో ఈ నెల 11న విడుదల కాబోతున్న మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ మీద డింపుల్ ఆశలన్నీ పెట్టుకుంది. ఇందులో మీనాక్షి చౌదరి మరో నాయికగా నటిస్తోంది. అయినా డింపుల్ కు సైతం ఈ మూవీలో చక్కని ప్రాధాన్యం ఉందని అంటున్నారు. మరి ఇప్పటికే బిజినెస్ పరంగా క్రేజ్ సంపాదించుకున్న ‘ఖిలాడి’ డింపుల్ హయతీ కి సూపర్ హిట్ ను అందిస్తుందేమో చూడాలి.