యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్
లో నటిస్తున్నాడు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మూవీలో ఎన్టీయార్ నటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… దీని కంటే ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఎన్టీయార్ సినిమా ఉంటుందనే దాని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనతో – కేజీఎఫ్
ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా నిర్మించబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. విశేషం ఏమంటే… ట్రిపుల్ ఆర్
కు ప్రశాంత్ నీల్ సినిమాకు మధ్యలో ఒకటి రెండు సినిమాలు ఉన్నా… ఇందులో ఎన్టీయార్ క్యారెక్టర్ ఏమిటనేది బయటకు వచ్చేసింది. ప్రశాంత్ నీల్ మూవీలో యంగ్ పొలిటీషియన్ గా ఎన్టీయార్ నటిస్తాడని అంటున్నారు. మరి అలాంటి పవర్ ఫుల్ పొలిటీషియన్ ను ఎదుర్కొనడానికి అంతే పవర్ ఫుల్ విలన్ కావాలి కదా… అందుకే ఆ పాత్రకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని తెలుస్తోంది. ‘సైరా’ తర్వాత విజయ్ సేతుపతి ఉప్పెన
మూవీలో నటించాడు. ఈ రెండు సినిమాలు మంచి విజయాన్నే అందుకున్నాయి. అందువల్ల విజయ్ సేతుపతి స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తే హిట్ అనే ఓ సెంటిమెంట్ ఏర్పడిపోయింది. దాంతో ఎంతోమంది దర్శక నిర్మాతలు చిన్న గెస్ట్ అప్పీయరెన్స్ అయినా ఇవ్వమని విజయ్ సేతుపతిని అడుగుతున్నారట. మరికొందరైతే భారీ రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేస్తూ బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారట. అయితే… `ఉప్పెన’తో తెలుగురాష్ట్రాలలో తన అభిమానులను విశేషంగా పెంచేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో ఏర్పడిన అనుబంధం కారణంగానే విజయ్ సేతుపతి… ఎన్టీఆర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. అదే నిజమైతే మాత్రం రెండు కొదమ సింహాల మధ్య సాగే భీకర పోరును వెండితెర సాక్షిగా చూసేయొచ్చు!!