సినిమాలు, వెబ్ సిరీస్ లకే కాదు డైలీ సీరియల్స్ కి కూడా సీక్వెల్స్ అవసరమే అంటోంది ఏక్తా కపూర్. బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత్రి మరోమారు ‘పవిత్ర రిష్తా’ బుల్లితెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉందట. 2009 నుంచీ 2014 దాకా ‘పవిత్ర రిష్తా’ డైలీ సీరియల్ సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. అయితే, ఆ సీరియల్లో మానవ్, అర్చనగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అంకితా లోఖండే సదరు షో కంటే ఎక్కువ ప్రాచుర్యం పొందారు. రీల్ లైఫ్ లో భార్యాభర్తలుగా, రియల్ లైఫ్ లో లవ్వర్స్ గా వారిద్దరూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు…
‘పవిత్ర రిష్తా’ నుంచీ సుశాంత్ తప్పుకున్నాక హితేన్ తేజ్ వాని మూడేళ్ల పాటూ మానవ్ గా అలరించాడు. అర్చనగా మాత్రం అంకితా లోఖండేనే కొనసాగింది. 2014లో సీరియల్ ఆగిపోయాక ఈ మధ్యే 12 ఏళ్ల మైలురాయి దాటింది డైలీ షో. అప్పుడే పుష్కర కాలం గడిచిపోయింది అంటూ అంకితా భావోద్వేగంతో సొషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె సుశాంత్ గురించి ప్రస్తావించకున్నా నెటిజన్స్ దివంగత నటుడ్ని స్మరించుకున్నారు.
2021 జూన్ 14తో సుశాంత్ అకాల మరణానికి సంవత్సరం పూర్తైంది. అయితే, ఇటువంటి సమయంలోనే ఏక్తా కపూర్ ‘పవిత్ర రిష్తా 2.0’ ప్లాన్ చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే సీరియల్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైందట. అర్చనగా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ లో మళ్లీ అంకితా లోఖండే కనిపించబోతోంది. మానవ్ పాత్రలో మాత్రం షహీర్ షేక్ నటిస్తాడట. ఆయనకి ఇప్పటికే డైలీ సిరియల్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. కొన్ని సూపర్ హిట్ డైలీస్ లో నటించి మెప్పించాడు. చూడాలి మరి, ‘పవిత్ర రిష్తా 2.0’లో అర్చనా అలియాస్ అంకితాని మూడో మానవ్ తో ( సుశాంత్, హితేన్, షహీర్ ) జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో!