NTR Family Sentiment:ఇటీవల నటరత్న ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబానికే ‘ఆగస్టు నెల అచ్చిరాదు’ అని కొందరు టముకు వేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన రెండు సార్లు ఆగస్టులోనే బర్తరఫ్ కావడంతో ఈ సెంటిమెంట్ బలంగా ఉందని చెప్పవచ్చు. అయితే చిత్రసీమలో ఎన్టీఆర్ కు, ఆయన నటవారసులకు కూడా ఆగస్టు నెల అచ్చివచ్చిందనే చెప్పాలి. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ విజయంతో అది మరోసారి రుజువయింది.
నిజానికి చిత్రసీమలో ఎన్టీఆర్ కు ఆగస్టు మాసం భలేగా కలసి వచ్చిందనే చెప్పాలి. 1953లో యన్టీఆర్, భానుమతి నటించిన ‘చండీరాణి’ ఆగస్టు 28న విడుదలయింది. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొంది మూడు చోట్ల శతదినోత్సవాలు చూసింది. ఇక యన్టీఆర్, భానుమతి జంటగానే రూపొందిన ‘అగ్గిరాముడు’ చిత్రం 1954 ఆగస్టు 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఎన్టీఆర్ కు తరువాత ‘రాముడు’ అన్న టైటిల్ వరంగా మారడానికి ఈ సినిమా కారణమయింది. దాదాపు 30 ఏళ్ళ వ్యవధిలో ఆగస్టు మాసంలో ఎన్టీఆర్ నటించిన 28 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 9 పరాజయం పాలు కాగా, మిగిలిన 19 చిత్రాలు విజయకేతనం ఎగురవేశాయి. అందులోనూ “చండీరాణి, అగ్గిరాముడు, వినాయకచవితి, మంచిమనసుకు మంచిరోజులు, జగదేకవీరుని కథ, బందిపోటు, వీరాభిమన్యు, దేవుడు చేసిన మనుషులు” వంటి సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి.
ఎన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణకు కూడా ఆగస్టులో ‘దేశోద్ధారకుడు’ (1986) వంటి సూపర్ హిట్ ఉంది. అలాగే ఎన్టీఆర్ మరో నటవారసుడు నందమూరి హరికృష్ణ నటించిన ‘సీతయ్య’ కూడా 2003 ఆగస్టు 22న విడుదలై మంచి విజయాన్ని చేజిక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలచిన ‘యమదొంగ’ 2007 ఆగస్టు 15న విడుదలై విజయఢంకా మోగించింది. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన కళ్యాణ్ రామ్ తాజా చిత్రం ‘బింబిసార’ కూడా ఆగస్టు 5న విడుదలై విజయపథంలో పయనిస్తోంది. మరి ఈ సెంటిమెంట్ ని ఏమంటారు?