విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇప్పటికీ కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారు. రాముడు, కృష్ణుడు వంటి దేవతా రూపాలన్నీ ఆయనలోనే కనిపిస్తాయి. ఆయన తన సినీ జీవితాన్ని ‘మన దేశం’ చిత్రంతో ప్రారంభించి, ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంతో ముగించారు. ఆ వయసులో కూడా ఆయన షూటింగ్‌లో అద్భుతమైన ఉత్సాహంతో పాల్గొన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు, కానీ ఎన్టీఆర్ రూపంలో వారిని చూడొచ్చు. మేము దైవంగా ఆరాధించే మహానుభావుడు ఆయన” అని కొనియాడారు.
Also Read: Kannappa: కన్నప్ప హార్డ్ డిస్క్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతం
నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ…నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ, “నాన్నగారి జయంతి మాకు పండగ రోజు. ఆయన ఒక అవతార పురుషుడు. నా దృష్టిలో ఆయన భగవంతుడు. కోట్ల మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే సూత్రాన్ని నమ్మి, ఆచరించారు. సినీ రంగంతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాజకీయ నాయకుడిగా పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది నుంచి ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు.
Also Read: Operation Sindhoor: దేశభక్తిని చాటేలా ‘ఆపరేషన్ సింధూర్’ సాంగ్
నందమూరి రూప మాట్లాడుతూ… నందమూరి రూప మాట్లాడుతూ, “మా తాతగారైన నందమూరి తారకరామారావు గారి 102వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి పౌరుషం, ఆత్మగౌరవం. తెలుగు వారికి దైవసమానుడు. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు. స్వయంకృషితో ఎదిగి, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు” అని అన్నారు.
తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, “చరిత్రలో మొట్టమొదటి పాన్-ఇండియా స్టార్ ఎన్టీఆర్ గారు. తన ఐదో చిత్రం ‘పాతాళ భైరవి’తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సూపర్ హిట్స్ సాధించారు. సినీ రంగంలో రారాజుగా వెలిగారు. ఆ రోజుల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నారు. తెలుగు జాతిని ఒక కుటుంబంగా భావించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి, అధికారంలోకి వచ్చి, అనేక సంక్షేమ పథకాలతో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపించారు. అలాంటి మహానుభావుడికి మరణం లేదు” అని అన్నారు.