దేశం పట్ల ప్రేమ కలిగి ఉండటం ఒక విషయమైతే, ఆ ప్రేమను ప్రజలకు ఉపయోగపడేలా ఒక రూపంలో వ్యక్తపరచడం సామాన్యమైన విషయం కాదు. ఇటీవల మన దేశ పౌరులపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా, మన జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్‌ను ప్రేరణగా తీసుకుని, ప్రముఖ ఆరోగ్య డైట్ నిపుణులు లక్ష్మణ్ పూడి ఒక దేశభక్తి గీతాన్ని రూపొందించారు. ఈ పాట ద్వారా తన దేశభక్తిని వ్యక్తపరిచిన లక్ష్మణ్, స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, స్వరం అందించారు. ఈ పాటకు ప్రసాద్ సాహిత్యం రచించగా, రమేష్ సంగీతం సమకూర్చారు. కృష్ణ సినిమాటోగ్రఫీ, ఉమా శంకర్ కొరియోగ్రఫీ, మణికంట ఎడిటింగ్, సత్య శ్రీనివాస్ సంగీత సహకారం అందించారు.
Also Read:Kannappa: కన్నప్ప హార్డ్ డిస్క్ డ్రైవ్ మిస్సింగ్ కేసులో విచారణ వేగవంతం
ఈ పాట లాంచ్ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ, నటుడు అలీ, మేజర్ ఒబెరాయ్, జేఏసీ చైర్మన్ అంజిబాబు, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…”మిత్రుడు లక్ష్మణ్ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మన జవాన్ల గురించి ఒక గీతం రూపొందించి, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం ఆనందకరం. దేశ జవాన్ల పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచారు. ఆయనను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. లక్ష్మణ్ గారు కేవలం ఆరోగ్య డైట్ గురించి మాత్రమే మాట్లాడతారని అనుకున్నాను, కానీ ఆయన తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం వల్ల ఆయనలోని దేశభక్తి, సామాజిక భావజాలం ఈ పాటలో స్పష్టంగా కనిపించింది. మనం రైతులకు, జవాన్లకు ‘జై కిసాన్, జై జవాన్’ నినాదంతో గౌరవం ఇస్తాం. గడియారంలో మధ్యాహ్నం 12 గంటలకు రైతులకు, రాత్రి 12 గంటలకు మనం ప్రశాంతంగా నిద్రించడానికి కారణమైన జవాన్లకు ముల్లులు నమస్కరిస్తాయి. కొన్ని దేశాల్లో రెండేళ్లపాటు మిలిటరీ శిక్షణ తప్పనిసరి. మన దేశంలో కూడా అలాంటి నియమం ఉండాలని సూచిస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ నా నమస్కారాలు.”