కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ ప్లే చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీ జూలై 28న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం వ్యక్తిగతంగానూ అభిమానులను కలిసి, థియేటర్ లో త్రీ డీ ట్రైలర్ ను ఆవిష్కరించే పని పెట్టుకుంది. అందులో భాగంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన షాలినీ మంజునాథ్, హీరో కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారి హైదరాబాద్ వచ్చారు. ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ నిర్వహించిన విజయ్ మాస్టర్, ఇందులో ఓ సూపర్ సాంగ్ ను పాడిన మంగ్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అఖిల్ అక్కినేని ఈ వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అబద్ధాలను కథలుగా చెప్పే తాను తొలిసారి నిజం మాట్లాడుతున్నానని, ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ తనకెంతో నచ్చిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. కన్నడ చిత్రసీమ అంటే ‘కేజీఎఫ్’ ముందు వరకూ కొంత చిన్న చూపు చాలామందికి ఉండేదని, కానీ ఇప్పుడు బెంచ్ మార్క్ సినిమాలను ఆ రాష్ట్రం అందిస్తోందని, ‘విక్రాంత్ రోణ’ రషెస్ చూసి తాను థ్రిల్ కు గురయ్యానని, తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను సుదీప్ ఇచ్చాడని వర్మ అన్నారు. అలానే జాక్విలిన్ ఫెర్నాండేజ్ ఫిగర్ కంటే మంగ్లీ గొంతు ఎక్కువ సెక్సీగా ఉందని కితాబిచ్చారు వర్మ. ఈ సినిమాకు ఫైట్స్ సమకూర్చే అవకాశం తనకు ఇచ్చినందుకు విజయ్ దర్శక నిర్మాతలకు సుదీప్ కు కృతజ్ఞతలు తెలిపారు. కన్నడ ప్రేక్షకులు తనను ఎంతో ఆదరిస్తుంటారని, ఆశీర్వదిస్తుంటారని, ఇందులో తాను పాడిన పాటను రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రాశారని మంగ్లి చెప్పింది. ఈ మూవీ ట్రైలర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ సినిమా లా అనిపించిందని, పదేళ్ళగా సుదీప్ తో తనకు పరిచయం ఉందని, ఆయన మైండ్ కూడా చాలా పవర్ ఫుల్, ‘విక్రాంత్ రోణ’ లాంటి సినిమాలను అందిస్తున్నందున దక్షిణాది వాడిగా గర్వపడుతున్నానని అఖిల్ చెప్పాడు.
చిత్ర నిర్మాత షాలిని మాట్లాడుతూ, ” ఈ చిత్ర నిర్మాత, నాభర్త జాక్ మంజునాథ్ అనారోగ్యం కారణంగా ఇక్కడకు రాలేకపోయారు. ఎంతో కష్టపడి, ఎంతోమంది సహకారంతో ఈ సినిమాను నిర్మించాం. సుదీప్ అందించిన సహకారం అయితే మరువలేం. షూటింగ్ సమయంలోనే చాలా విషయాల్లో చరిత్ర సృష్టించిన ఈ సినిమా, విడుదల తర్వాత కూడా చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ, ”నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘గీతాంజలి’. భాషరాకపోయినా ఆ సినిమా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అలానే సైకిల్ చెయిన్ పట్టుకున్న నాగార్జున అన్నా ఇష్టమే. నా తొలి రెండు చిత్రాల పోస్ట్ ప్రొడక్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిగింది. ఈ సినిమా షూటింగ్ నూ అక్కడే చేశాం. ఇక నాగ్ సార్ తో చెయిన్ పట్టించిన ఆర్జీవి గారు ఈవేదిక మీద ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా రషెస్ చూసి నాగార్జున గారు అభినందించడం ఆనందాన్ని కలిగించింది” అని అన్నారు. చివరగా హీరో సుదీప్ మాట్లాడుతూ, ”నా ఫ్రెండ్ జాక్ మంజునాధ్ కోసం మొదలెట్టిన సినిమా ఇది. దాదాపు నాలుగేళ్ళుగా దర్శకుడు అనూప్ తో ప్రయాణం సాగిస్తున్నాను. ఇప్పటికీ బెటర్ ప్రొడక్ట్ కోసం ఆయన కష్టపడుతూనే ఉన్నారు. కరోనా టైమ్ లో ఏకంగా రెండున్నర నెలల పాటు అన్నపూర్ణ స్టూడియోస్ లో మేం మకాం వేశాం. దాదాపు మూడు వందల మంది ఇక్కడ ఉన్న అన్ని ఫ్లోర్స్ ను వాడుకున్నారు. ఆ సమయంలో ఈ స్టూడియో మొత్తం మేమే ఓనర్స్ మాదిరి తిరిగాం. మనం నిజాయితీతో పనిచేస్తే టైమ్ సపోర్ట్ చేస్తుందని అంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. కరోనా కారణంగా ఎన్నో సినిమాల షూటింగ్స్ మొదలై, ఆగిపోయాయి. కానీ మా సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకూ ఒక్కరికి కూడా కరోనా రాలేదు. ఈ సినిమాను త్రీడీలో తీశాం. అందరికీ ఓ సరికొత్త అనుభూతిని అందిస్తుందని గట్టిగా చెప్పగలను” అని అన్నారు.