భారత దిగ్గజ అథ్లెటిక్ ప్లేయర్ స్ప్రింటర్ మిల్కా సింగ్ కరోనాతో మరణించారు. ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. తన పరుగుతో భారత కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశాడు. మిల్కాసింగ్ నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. ఆయన మరణంపై యావత్ భారతం ఘన నివాళులు అర్పిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం తెలిపారు.
“పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీ.. మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్ట ను, భారత పతాకాన్ని అంతర్జాతీయస్థాయి లో రెపరెప లాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్ కు నివాళి..” అంటూ మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు.
నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేస్తూ… “స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్ ఎలా ముందుకు నడవాలో ఆలోచిస్తుంటే, మీరు పరుగెత్తడం నేర్పించారు. పెద్ద కలలను కనడం, ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని అధిగమించి కలలను ఎలా సాకారం చేసుకోవాలో నేర్పారు. రాబోయే తరాలన్నింటికీ మీరు స్ఫూర్తిగా నిలుస్తారు.. దేశం ఎప్పుడు మిమల్ని గుర్తుపెట్టుకుంటుంది. మీరెప్పుడు మా హీరో..” అంటూ సంతాపం తెలిపారు.
“మిల్కా సింగ్ మరణంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యాను.. స్పోర్ట్స్ లెజెండ్ ను కోల్పోయాం” అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు సంతాపం తెలిపారు.