నాలుగేళ్ళ క్రితం నితిన్ ‘లై’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాశ్. ఆ తర్వాత సంవత్సరమే నితిన్ మూవీ ‘చల్ మోహన్ రంగా’లోనూ మేఘా నాయికగా నటించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. చిత్రం ఏమంటే… ఆమె నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. బట్… ‘లై’ పాటలు హిట్ కావడంతో, యూత్ లో మేఘా ఆకాశ్ కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత తమిళ, హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన మేఘా ఇప్పుడు తిరిగి తెలుగు సినిమాలకు సైన్ చేస్తోంది. ఇటీవలే ఆమె నటించిన ‘రాజరాజ చోర’, ‘డియర్ మేఘ’ చిత్రాలు విడుదలయ్యాయి. అందులో శ్రీవిష్ణు సరసన ఆమె నటించిన ‘రాజరాజ చోర’కు ప్రేక్షకాదరణ లభించింది.
పూర్తి స్థాయిలో ఘన విజయాలను సొంతం చేసుకోకపోయినా, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని మేఘా ఆకాశ్ ముందుకు సాగుతోంది. దాంతో ఇప్పుడామె చేతిలో ఏకంగా మూడు, నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో శివ కందుకూరి నటిస్తున్న ‘మను చరిత్ర’ ఒకటి.
అలానే సత్యదేవ్, తమన్నా నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ మూవీలోనూ మేఘా ఆకాశ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక బైలింగ్వల్ మూవీ ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’లోనూ మేఘా ఆకాశ్ నటిస్తోంది. అక్టోబర్ 26 (నేడు) మేఘా ఆకాశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘మను చరిత్ర’ సినిమాలోని ‘ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్లా’ అనే పాటను కాజల్ విడుదల చేయబోతోంది. ఈ సినిమాకు కాజల్ ప్రెజంటర్ కావడం విశేషం. కథానాయిక పాత్రల కోసమే గిరి గీసుకుని కూర్చోకుండా మంచి పాత్ర ఏది లభించినా నటించడానికి మొగ్గు చూపుతున్న మేఘా ఆకాశ్ కు మంచి భవిష్యత్తు ఉండే ఆస్కారముంది.