టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు వారణాసి’లో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ కోసం ఆయన తన రెండు మూడేళ్ల కాలాన్ని పూర్తిగా కేటాయించారు. అయితే, ఈ సినిమా తర్వాత మహేష్ అడుగులు ఎటువైపు? గ్లోబల్ మార్కెట్‌ను ఆయన ఎలా కాపాడుకుంటారు? అనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా జాతీయ స్థాయిలో భారీ మార్కెట్ ఏర్పడుతుంది. ఆ క్రేజ్‌ను నిలబెట్టుకోవాలంటే ఆ తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ తన మార్కెట్‌ను సుస్థిరం చేసుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అదే ఫాలో అయ్యారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే పంథాను అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Tollywood 2025: ఇవానా టు అనస్వర.. ఈ ఏడాది టాలీవుడ్‌లో మెరిసిన మాలీవుడ్ బ్యూటీస్!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి సినిమా షూటింగ్ నుంచి మహేష్ 2026 వేసవి నాటికి ఫ్రీ అయిపోతారు. ఆ తర్వాత సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పుడే, మహేష్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఆయన తన సొంత నిర్మాణ సంస్థ ‘GMB ఎంటర్టైన్మెంట్’ (GMB) పైనే తదుపరి సినిమా చేయాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. ఒకవేళ వేరే నిర్మాతలు ముందుకు వచ్చినా, అది ఖచ్చితంగా GMBతో కలిసి చేసే ‘జాయింట్ వెంచర్’ మాత్రమే అవుతుందని టాక్. రాజమౌళి సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే, అంటే జూన్ నాటికే కొత్త సినిమాను ప్రారంభించాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే సరైన కథను, స్టార్ డైరెక్టర్‌ను ఎంపిక చేసే పనిలో మహేష్ టీమ్ నిమగ్నమైందని, అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ‘వారణాసి’ విడుదలైన కొద్ది నెలల వ్యవధిలోనే మహేష్ నుంచి మరో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇది సూపర్ స్టార్ అభిమానులకు నిజంగానే ఊహించని శుభవార్త. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే గ్లోబల్ క్రేజ్‌ను వాడుకుంటూనే, తన సొంత బ్యానర్‌లో భారీ ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా మహేష్ బాబు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవాలని చూస్తున్నారని అర్ధమవుతోంది.