భారతీయ సినిమా గత కొన్ని ఏళ్లలో వందల రెట్లు పెరిగిపోయింది. క్వాలిటి మాట ఎలా ఉన్నా మన బడ్జెట్స్ మాత్రం అమాంతం ఆకాశాన్ని తాకేస్తున్నాయి. ముఖ్యంగా, ‘బాహుబలి’ తరువాత చాలా మంది నిర్మాతలు వందల కోట్లు సినీ నిర్మాణం కోసం కుమ్మరిస్తున్నారు. అసలు భారీ చిత్రాల విషయానికొస్తే 100 కోట్లు కూడా అత్యంత సాధారణ బడ్జెట్ గా మారిపోయింది. రానున్న కాలంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సెట్స్ మీదకు వెళుతోన్న ‘ప్రాజెక్ట్ కే’ 400 కోట్లతో తెరకెక్కిస్తారట!
రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే రూపొందుతోంది. హిందీలో ఇంకా పలు సినిమాలు కోట్లకు కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్నారు. ఈ మల్టీ క్రోర్ ప్రాజెక్ట్స్ లో కొన్ని పౌరాణికాలు కూడా ఉండటం మరో విశేషం! రామాయణ, భారతాల ఆధారంగా భారీ తారాగణంతో సినిమాలు తీసేందుకు స్టార్ ప్రొడ్యూసర్స్ ఉత్సాహం చూపుతున్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా, కరీనా లేదా ఆలియా లాంటి స్టార్ హీరోయిన్ తో మరో రామాయణం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇవన్నీ కాకుండా నిర్మాత మధు మంతెన మరో భారీ రామాయణం ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత భారతం కూడా వెండి తెర మీదకు తీసుకొచ్చే ఆలోచనలో మన యాంబీషియస్ ప్రొడ్యూసర్ ఉన్నాడు…
Read Also : “పుష్ప”రాజ్ ను ఢీ కొట్టబోతున్న “కేజీఎఫ్-2” ?
మధు మంతెన వరుసగా భారతీయ పౌరాణికాలు రూపొందిస్తూ తనదైన ఓ మైథలాజికల్ యూనివర్స్ సృష్టించాలని భావిస్తున్నాడట. రామాయణం ప్రాజెక్ట్ లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా సంయుక్త నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అయితే, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్టై పోయింది. నితీశ్ తివారీ దర్శకత్వం వహించనున్న మధు మంతెన ‘రామాయణం’ మొదట్లో 300 కోట్లతో బాక్సాఫీస్ వద్దకు వచ్చేస్తుందని అంచనా వేశారు. కానీ, తాజా పరిస్థితుల దృష్ట్యా ఇంకా ఎక్కువ ఖర్చే లెక్కకొస్తుందని భావిస్తున్నారు. ‘రామాయణం’ తరువాత ‘భారతం’ కూడా సినిమాగా మారనుంది. ద్రౌపతి దృష్టి నుంచీ మహాభారతం ప్రేక్షకులకి చూపించే ప్రయత్నం డైరెక్టర్ రవి ఉద్యవర్ చేయనున్నాడు. ఈ భారీ ప్రాజెక్ట్ లో ద్రౌపదిగా దీపిక కనిపించనుంది. ఆమె ఒక ప్రొడ్యూసర్ గా కూడా కీలక పాత్ర పోషిస్తుంది!
గతంలో ఎప్పుడూ లేనంతగా టెక్నాలజీ ఇప్పుడు దర్శకనిర్మాతలకి లభిస్తోంది. ఏది గ్రంథాల్లో ఉంటే అది తెరపై చూపించగలిగే సత్తా పరిశ్రమ సాధించింది. అందుకే, ఎపిక్ మూవీస్ పై ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి పెరిగింది. చూడాలి మరి, వందల కోట్లతో చేస్తోన్న ఈ హెవీ రిస్క్ ఎలాంటి విజయం అందిస్తుందో!