బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా ఉన్నారు. మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కానున్న ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తాజాగా మీడియాతో ముచ్చటించిన మ్యాడ్ గ్యాంగ్ – నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ – సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఇవిగో:
మీ ముగ్గురి కెమిస్ట్రీ సూపర్బ్‌గా ఉంటుంది. ఇకపై మరిన్ని సినిమాల్లో కలిసి సందడి చేస్తారా?
రామ్ నితిన్: ‘మ్యాడ్’ అనేది మాకు చాలా స్పెషల్. ఈ సినిమాతో వచ్చిన ప్రత్యేకత దీనితోనే ఉంటే బాగుంటుందనిపిస్తుంది.
సంగీత్ శోభన్: ఇప్పటిదాకా అలాంటి ఆలోచన రాలేదు, చూద్దాం భవిష్యత్‌లో ఏమవుతుందో!
‘మ్యాడ్ స్క్వేర్’లో అసలు హీరో ఎవరు? మీలో ఎవరైనా ఒకరేనా లేక వేరే ట్విస్ట్ ఉందా?
మ్యాడ్ గ్యాంగ్: ఈ సినిమాకి అసలైన హీరో వినోదమే! ఆ కామెడీనే ‘మ్యాడ్ స్క్వేర్’ని నడిపిస్తుంది. మమ్మల్ని కూడా అదే ఎక్కువగా నవ్విస్తూ ముందుకు తీసుకెళ్తుంది.
మొదటి పార్ట్‌తో పోలిస్తే ‘మ్యాడ్ స్క్వేర్’ ఎంతలా పిచ్చెక్కించబోతుంది?
రామ్ నితిన్: ‘మ్యాడ్’ కంటే ఈసారి కామెడీ డోస్ డబుల్ అవుతుంది. అశోక్ (నార్నె నితిన్), మనోజ్ (నేను) పాత్రలు కూడా ఈసారి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. ప్రేక్షకులు ఈ కామెడీ రైడ్‌ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం.
ఈ సినిమా సెట్స్‌పై ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ షేర్ చేయండి!
రామ్ నితిన్: ‘మ్యాడ్’ నా ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అప్పుడు కాస్త టెన్షన్ ఉండేది – ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేస్తారో అని. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’కి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో రెడీ అయ్యాం. దాంతో పర్ఫామెన్స్ ఇంకా సూపర్బ్‌గా వచ్చింది.
నార్నె నితిన్: ‘మ్యాడ్’లో నా పాత్ర మొదట సీరియస్‌గా స్టార్ట్ అయ్యి చివరికి కామెడీలో కలిసిపోయింది. ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’లో ఫుల్ టైమ్ కామెడీ రోల్‌లో కనిపిస్తాను. అందుకోసం నన్ను నేను రీడిజైన్ చేసుకున్నా!
సంగీత్ శోభన్: ‘మ్యాడ్’ సక్సెస్ ఇచ్చిన ఊపుతో ఈ సినిమాని ఆడుతూ పాడుతూ చేశాం. ఎక్కువ నవ్వించాలనే టార్గెట్ తప్ప పెద్దగా కసరత్తులు చేయలేదు. సెట్స్‌పై అయితే నవ్వులు ఆపలేకపోయాం!
సీక్వెల్ చేస్తున్నామని చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది? షాక్ అయ్యారా, సంబరపడ్డారా?
రామ్ నితిన్: సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యాం! ‘మ్యాడ్’ షూటింగ్ అయిపోయినప్పుడు ఈ టీంని మిస్ అవుతామని బాధపడ్డాం. కానీ సినిమా హిట్ అయ్యాక, వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేయడంతో ఆనందానికి అవధుల్లేవు!
నిర్మాత నాగవంశీ గారు “ఈ సినిమాలో కథ లేదు” అన్నారు కదా?
నార్నె నితిన్: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాల్లో కథ కోసం చూడాలి. మాది నవ్వుల కోసం తీసిన సినిమా. “పెద్ద కథ ఆశించకండి, సరదాగా నవ్వుకోవడానికి రండి” అనే ఉద్దేశంతోనే నాగవంశీ గారు అలా అన్నారు.
సంగీత్ శోభన్: సినిమా ఎందుకు తీశామో ముందే చెప్పేస్తే ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది. ఇది కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలిస్తే, ఆ అంచనాలతో థియేటర్‌కి వస్తారు.
‘మ్యాడ్’ సక్సెస్‌లో నాగవంశీ గారి రోల్ ఎంత ఉంది? ఆయన స్టైల్ గురించి ఏం చెప్తారు?
రామ్ నితిన్: నాగవంశీ గారు లేకపోతే ‘మ్యాడ్’ ఇంత బాగా రాదు. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. నన్ను ఒక వెబ్ సిరీస్‌లో చూసి “మనోజ్ పాత్రకు నీవే సరిపోతావ్” అని సెలెక్ట్ చేశారు. ఆయన విజన్, టీంకి ఇచ్చే స్వేచ్ఛ అద్భుతం.
ఈసారి సినిమాలో హీరోయిన్స్ ఉంటారా? లవ్ ట్రాక్‌లతో సందడి చేస్తారా?
నార్నె నితిన్: మొదటి భాగంలో ఉన్నట్టే, హీరోయిన్స్ పాత్రలు మా కథలో భాగంగా ఉంటాయి. కానీ ఈసారి వాళ్లు స్క్రీన్‌పై కనిపించరు – ఇదొక ట్విస్టే!
‘మ్యాడ్ స్క్వేర్’ అభిమానులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది?
సంగీత్ శోభన్: ‘మ్యాడ్’ హిట్ అవడానికి కారణం వినోదం. ఆ బలాన్ని ఉపయోగించి ‘మ్యాడ్ స్క్వేర్’ని పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాం. కొత్త కామెడీ సీన్స్‌తో థియేటర్లలో నవ్వులు గ్యారంటీ!
కుటుంబ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుందా? ఏదైనా స్పెషల్ సీన్స్ ఉన్నాయా?
సంగీత్ శోభన్: ‘మ్యాడ్’ రిలీజ్‌కి ముందు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చాయి. కానీ కుటుంబ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా క్లీన్ కామెడీ ఫిల్మే. నాగవంశీ గారు చెప్పినట్టు, పెళ్లి సీక్వెన్స్ అందరికీ ఫేవరెట్ అవుతుంది!
లడ్డు పాత్ర ఈసారి ఎలా ఉండబోతుంది? మళ్లీ రచ్చ చేస్తాడా?
సంగీత్ శోభన్: ‘మ్యాడ్’లో కంటే ఈసారి లడ్డు ఇంకా పిచ్చెక్కిస్తాడు. మేము ముగ్గురం కలిసి లడ్డుతో ఫుల్ ఎంజాయ్ చేస్తాం – ఆ సీన్స్ సూపర్ ఫన్ అవుతాయి!
నార్నె నితిన్ గారు, మీ బావ జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఏమైనా టిప్స్ ఇచ్చారా?
నార్నె నితిన్: నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఆయన గైడెన్స్‌తోనే నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నా. ఇకపై కూడా ఆయన సపోర్ట్ తీసుకుంటాను.
‘మ్యాడ్’ ఫ్రాంచైజ్‌ని ఇంకా కొనసాగిస్తే ఎలా ఉంటుంది? మరో పార్ట్ ప్లాన్ ఉందా?
మ్యాడ్ గ్యాంగ్: కొనసాగిస్తే బాగుంటుంది, కానీ వెంటనే కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి చేస్తే ఇంకా స్పెషల్‌గా ఉంటుందని అనుకుంటున్నాం. చూద్దాం, ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో!