బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇదివరకే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న “దోస్తానా 2” చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ బయటకు వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించబోయే ఏ చిత్రంలోనూ కార్తీక్ ను తీసుకోబోమని కరణ్ ప్రొడక్షన్ హౌజ్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం కార్తీక్ మరో చిత్రం నుంచి తప్పుకున్నారట. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ “రెడ్ చిల్లీస్”లో అజయ్ బెహల్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దాదాపు 2 ఏళ్ల క్రితమే కార్తీక్ సైన్ చేశాడట. అయితే తాజాగా దర్శకుడు అజయ్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్ట్ కూ గుడ్ బై చెప్పేశాడట. దర్శకుడు ముందుగా చెప్పిన లైన్ కు, ఇప్పటి స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్ ఈ నిర్ణయానికి వచ్చాడట. ఇటీవల ‘ధమాకా’ అనే క్రైమ్ థ్రిల్లర్ లో నటించిన తనకు మళ్ళీ అదే జోనర్ మూవీలో నటించడం ఇష్టం లేదని ‘రెడ్ చిల్లీస్’కు వివరించాడట. అడ్వాన్స్ గా తీసుకున్న 2 కోట్ల రూపాయలను కూడా వెనక్కి ఇచ్చేశాడట ఈ బీ టౌన్ హీరో.