ఈ రోజు (బుధవారం) నుండి వేతనాలు పెంచే వరకూ సినిమా షూటింగ్స్ కు హాజరు అయ్యే ప్రసక్తే లేదని 24 యూనియన్లకు చెందిన కార్మికులు చెబుతున్నారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులపై వత్తిడి తెచ్చేందుకు ఆ కార్యాలయాన్ని ఇవాళ ముట్టడిస్తున్నారు. ఇదే విషయాన్ని మంగళవారం ఫెడరేషన్ కార్యవర్గం స్వయంగా తెలియచేసింది. ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి కార్మికల వేతనాల విషయంలో సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమీ ఉండదని చెప్పింది. అయితే… ఇటీవల కన్నుమూసిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ దాస్ నారంగ్ స్థానంలో ఆ పదవిని చేపట్టిన కొల్లి రామకృష్ణ తమకు ఫెడరేషన్ నుండి ఎలాంటి సమ్మె నోటీసు రాలేదని అన్నారు. ఒక వేళ కార్మికలు సమ్మె చేయాలని అనుకుంటే పదిహేను రోజుల ముందు నోటీసు ఇవ్వాలని, అలా ఇవ్వలేదని, కాబట్టి నిర్మాతలు బుధవారం యథావిధిగా షూటింగ్స్ చేసుకోవచ్చని చెప్పారు. కానీ… ఈ నెల 6వ తేదీనే తాము తమ నిర్ణయాన్ని తెలియచేశామని ఫెడరేషన్ కార్యవర్గం చెబుతోంది.
దానిని ధృవీకరిస్తూ, ఈ నెల 6వ తేదీ ఛాంబర్ కు రాసిన లేఖను మీడియాకు అందచేసింది. ఆ లేఖపై ఛాంబర్ ఆరవ తేదీనే స్వీకరించినట్టూ ఉంది. వేతన సవరణ గడువు కాలం పూర్తయ్యి 13 నెలలు దాటిపోయిందని, వెంటనే వేతనాలను సవరించకపోతే, 15 రోజుల తర్వాత కార్మికులు ఎవ్వరూ షూటింగ్స్ కు హాజరు కాకూడదనే నిర్ణయం తీసుకున్నారని, కాబట్టి వెంటనే ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకోమని ఆ లేఖలో ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్పష్టంగా పేర్కొంది. ఏదో ఒక వంకతో తాత్సారం చేసిన ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి వారే ఇప్పుడు జరుగబోయే సమ్మెకు కారకులని ఫెడరేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి కార్యవర్గం జరిపే చర్చలతో ఈ సమస్యకు పరిష్కారం దొరకుతుందేమో చూడాలి.
Tfi Letter