విశేష్ ఫిల్మ్స్… ఈ బ్యానర్ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఎందుకంటే, ఈ బ్యానర్ వెనుక ఉన్నది ముఖేష్ భట్, మహేశ్ భట్. వీరిద్దరి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేముంది? మరీ ముఖ్యంగా, మహేశ్ భట్ దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు. అతని చాలా సినిమాలు అన్న ముఖేశ్ భట్ ‘విశేష్ ఫిల్మ్స్’ బ్యానర్ పైనే రూపొందించాడు. అయితే, 2021 ప్రారంభంలో భట్ బ్రదర్స్ విడిపోయారు. విశేష్ ఫిల్మ్స్ తో మహేశ్ భట్ ఇక మీదట కలసి పని చేయడని ముఖేశ్ భట్ చెప్పాడు. అయితే, తమ మధ్య ఎలాంటి గొడవా జరగలేదని సీనియర్ భట్ స్పష్టత ఇచ్చాడు.
గతంలో విశేష్ ఫిల్మ్స్ బ్యానర్ పై మహేశ్ భట్ డైరెక్షన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి ముఖేశ్ భట్ నిర్మాతగా వ్యవహరించేవాడు. ఇక మహేశ్ భట్ తాను దర్శకత్వం వహించని చిత్రాలకి కూడా క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించేవాడట. కానీ, ఇప్పుడు ముఖేశ్ భట్ నిర్వహణలో ఉన్న ‘విశేష్ ఫిల్మ్స్’తో మహేశ్ భట్ అన్ని రకాల సంబంధాలు తెంచేసుకున్నాడు. మొత్తంగా భట్ బ్రదర్స్ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు…
మరి మహేశ్, ముఖేశ్ భట్ విడిపోవటం గురించి ఇమ్రాన్ హష్మి ఏమంటున్నాడు? రీసెంట్ గా ఆయన ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్సందించాడు. నిజానికి ఇమ్రాన్ విశేష్ ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాలు చేయటమే కాకుండా మహేశ్, ముఖేశ్ ఇద్దరికీ దగ్గరి బంధువు కూడా. అందుకే, అసలు లోలోపల ఏం జరిగిందో చెబుతాడని ఆయన్ని మీడియా ప్రశ్నించింది. కానీ, ఇమ్రాన్ తనకు కూడా మహేశ్, ముఖేశ్ భట్ మధ్య ఏం జరిగిందో తెలియదని చెబుతూనే వారిద్దరూ మళ్లీ కలసి సినిమాలు చేయాలని కోరుకున్నాడు. విశేష్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఇద్దరు భట్ బ్రదర్స్ సంయుక్తంగా సినిమా చేయటం అసాధ్యమేం కాదని ఇమ్రాన్ అన్నాడు. ముఖేశ్ భట్ ‘ముంబై సాగా’ సినిమా విడుదల సందర్భంగా ఇమ్రాన్ హష్మికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాడట! కానీ, మహేశ్ భట్ విషెస్ చెప్పినట్టు ఇమ్రాన్ చెప్పలేదు! అటు ముఖేశ్ భట్ కూడా భవిష్యత్ లో అవసరమైతే తాను మహేశ్ భట్ తో కలసి సినిమా చేస్తాననే అంటున్నాడు. అయితే, ఇప్పటి దాకా ఒక్క మాట కూడా మాట్లాడని మహేశ్ ఏమంటాడో చూడాలి! వ్యవహారం బాగా పరిశీలిస్తే… చిక్కంతా మహేశ్ భట్ తోనే వచ్చినట్టుగా కనిపిస్తోంది మరి!