అభిమానులు ప్రేమతో అడగాలే కానీ మన హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి ఏమైనా చేసేస్తుంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమని అభిమానించే వారంటే వాళ్ళకూ అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది. అందుకోసమే సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ మన స్టార్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే దిశాపటానీ సైతం ఇటీవల అదే పనిచేసింది. తెలుగులో ‘లోఫర్’ మూవీలో నటించి, ఆ తర్వాత ఉత్తరాదినే సందడి చేస్తున్న ఈ సుందరి ఇటీవల ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పి నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఓ అభిమాని ‘మిమ్మల్ని ప్రత్యేకంగా చూపించేది ఏది?’ అంటూ ప్రశ్నించాడు. దీనిని ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్న దిశా పటాని… మరో ఆలోచన లేకుండా ‘తన కంటి కింద ఉండే పుట్టుమచ్చ’ అని చెప్పింది. అంతేకాదు… ఆ పుట్టుమచ్చను కాస్తంత క్లోజప్ లో చూపించింది. నిజంగానే తరచి చూస్తే కానీ సాధారణంగా దిశా పటానిలోని ఆ పుట్టుమచ్చ మనకు కనిపించదు. ఆ అభిమాని అడగడం, ఆమె దానిని చూపించడం భలే ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేయడం మొదలెట్టారు. ‘కుంగ్ ఫూ యోగా, బాగీ 2, భరత్’ చిత్రాలలో నటించిన దిశా పటాని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘రాధే’ చిత్రంతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.