Bimbisara: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ హీరోగా ఇంతవరకూ ఎనిమిది చిత్రాలు నిర్మించాడు. కానీ ఏ ఒక్క సినిమానూ స్టార్ డైరెక్టర్ తో అతను నిర్మించలేదు. ఆరేళ్ళ క్రితం ‘ఇజం’ సినిమాను పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో చేసినా అప్పుడు పూరి పరాజయాల్లో ఉన్నాడు. విశేషం ఏమంటే… ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ లో తొలి చిత్రం ‘అతనొక్కడే’ ను కొత్త దర్శకుడు సురేందర్ రెడ్డితో తీశాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత రెండో సినిమా ‘హరేరామ్’ను హర్షవర్థన్ తో నిర్మించాడు. అతను అప్పటికే బాలకృష్ణతో ‘విజయేంద్ర వర్మ’ లాంటి ఫ్లాప్ మూవీ తీశాడు. దర్శకుడు స్వర్ణ సుబ్బారావు తన పేరును హర్షవర్థన్ గా మార్చుకుని ఈ సినిమాను చేశాడు. ఆ తర్వాత కూడా ‘జయీభవ’తో నరేన్ కొండెపాటిని డైరెక్టర్ గా పరిచయం చేశాడు కళ్యాణ్ రామ్. అలానే తనతో ‘అభిమన్యు’ మూవీ తీసిన మల్లికార్జున్ తో ‘కళ్యాణ్ రామ్ కత్తి’ మూవీని నిర్మించాడు. ఇక ‘ఓం’ త్రీడీ మూవీతో సునీల్ రెడ్డిని డైరెక్టర్ గా పరిచయం చేశాడు. ఆ తర్వాత ‘పటాస్’తో అనిల్ రావిపూడికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. ఇలా కళ్యాణ్ రామ్ ఏ రోజునా సక్సెస్ ఫుల్ దర్శకుల వెనుక పడలేదు. కథను, కొత్త దర్శకుల ప్రతిభను నమ్మి అవకాశం ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ‘బింబిసార’ విషయంలోనూ అదే జరిగింది.
ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడు వెంకట్. అతను 2007లో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అంజలి హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో గీత రచయిత కులశేఖర్ దర్శకుడిగా తొలిసారి మెగాఫోన్ పట్టుకున్నాడు. కారణాలు ఏవైనా ఈ సినిమా అనుకున్న సమయంలో అనుకున్న విధంగా విడుదల కాలేకపోయింది. ఇప్పుడది యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంది. అందులో హీరోగా నటించిన వెంకట్ ను అందరూ ముద్దుగా వేణు అనిపిస్తారు. హీరోగా నటించిన తొలి చిత్రంతో ఎదురైన చేదు అనుభవాలతో వేణు… నటనకు స్వస్తి చెప్పి, దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫాంటసీ యాక్షన్ కథను తయారుచేసుకుని తెలిసివారిని కలిస్తూ వచ్చాడు. కొత్త దర్శకుడి మీద నమ్మకం లేకకొందరు, ఇంత భారీ చిత్రాన్ని తీసి రిస్క్ చేయడం ఇష్టం లేక మరికొందరు వేణుకు అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో కథ నచ్చి కళ్యాణ్ రామ్ అభయహస్తం చూపాడు. వెంకట్ ఈ సినిమా కోసం తన పేరును ‘వశిష్ఠ’గా మార్చుకున్నాడు. అతను రూపొందించిన తొలి చిత్రం ‘బింబిసార’ ఇవాళ విడుదలై విజయపథంలో సాగుతోంది. వెంకట్ గా సాధించలేని విజయాన్ని వశిష్ఠగా వేణు సాధించాడు!