రచయిత అనిల్ రావిపూడిలోని ప్రతిభను గుర్తించిన నందమూరి కళ్యాణ్ రామ్ అతన్ని ‘పటాస్’ మూవీతో దర్శకుడిని చేశారు. ఆ సినిమా చక్కని విజయం సాధించడంతో ఇక అనిల్ రావిపూడి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అలానే నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని అయిన అనిల్ రావిపూడి, ఆయనతో సినిమా చేసే ఛాన్స్ కోసం కొంతకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. బాలయ్య – అనిల్ కాంబినేషన్ లో మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే… ఇదే సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కోసం కూడా ఓ ప్రధాన పాత్రను అనిల్ రావిపూడి రాశాడట. దాంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం ‘నందమూరి ఫ్యామిలీ హీరోస్’ మల్టీస్టారర్ గా మారబోతోందని తెలుస్తోంది. విశేషం ఏమంటే.. ఈ సినిమా కంటే ముందే బాలకృష్ణ ‘అఖండ’లోనూ కళ్యాణ్ రామ్ కొద్దిసేపు మెరియబోతున్నాడని అంటున్నారు. ఏదేమైనా… నందమూరి అభిమానుల మనసుల్లో ఆనందాన్ని నింపే వార్తలు త్వరలో బాగానే రాబోతున్నాయి.