కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మన ఫిల్మ్ సెలబ్రిటీస్ కొత్త పంథాను ఎంపిక చేసుకున్నారు. చాలామందికి తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, ఎలాంటి సహాయం పొందాలనేది తెలియకుండా ఉంది. అలా ఇబ్బంది పడేవారికి, వారికి సాయం చేయాలనుకునే వారికి మన సెలబ్రిటీస్ వారధిగా నిలుస్తున్నారు. తాజాగా ఈ విషయంలో రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ బృందం సైతం తన ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి తగిన నివారణను చూపిస్తామని చెబుతోంది. కరోనాకు సంబంధించిన ప్రామాణికమైన సమాచారాన్ని ట్విట్టర్ లో ఆర్ఆర్ఆర్ మూవీ లో చూడొచ్చని రాజమౌళి తెలిపారు. తమ దగ్గరకు వచ్చే సమస్యలను దానిని పరిష్కరించే సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు చేరవేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఇదే బాటలో మరికొన్ని నిర్మాణ సంస్థలు, స్టార్ హీరోలు కూడా సాగడం అభినందించదగ్గది.