హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు. కేసీఆర్ తొందరగా కోలుకోలుకొని.. ప్రజా సేవలోకి రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయని చంద్రబాబు తెలిపారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు సైతం కేసీఆర్ను పరామర్శించారు.
Read Also: Pawan Kalyan: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకం..
ఇక, గత నాలుగు రోజుల క్రితం కేసీఆర్కు యశోద ఆస్పత్రి వైద్యులు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లోని బాత్రూంలో కేసీఆర్ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శిస్తున్నారు.. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.